సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా.. సర్వే కూడా పూర్తి కాని నాగోల్- ఎయిర్‌పోర్టు మెట్రో విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మసి పూసి మారేడు కాయ చేసినట్లు ఉంది. నిత్యం లక్ష మంది హైటెక్ సిటీ మీదుగా ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా డిజైన్లతో పాటు, టెండర్లు ఖరారు చేసినా.. రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో విషయంలో కల్లబొల్లి మాటలతో మభ్యపెడుతున్నారు.
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ సంస్థనే ఈ మార్గంలో తొలిదశలో లక్ష మంది ప్రయాణించే అవకాశం ఉందని, రెండేండ్లలో నాలుగు లక్షల మంది ఎయిర్‌పోర్టుకు ఈ మార్గంలో ప్రయాణిస్తారని, అంచనా వేసి ప్రతిపాదనలతోపాటు, శంకుస్థాపన చేసింది. కానీ రీ డిజైనింగ్ పేరిట ఎయిర్‌పోర్టు మెట్రోను తరలించిన రేవంత్‌రెడ్డి సర్కారు.. హైదరాబాద్‌కు దక్కాల్సిన దేశంలోని రెండో ఎయిర్‌పోర్టు మెట్రో సిటీ ఖ్యాతిని కాలరాసింది. డిజైన్లతోపాటు, నిర్మాణ కంపెనీలకు పనులు అప్పగించిన ఈ ప్రాజెక్టును రద్దు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి… జనసంచారమే ఉండని నాగోల్ మీదుగా ప్రాజెక్టును మళ్లించారు.
కానీ ఈ ప్రాజెక్టు రద్దు వల్ల జరుగుతున్న నష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ బీఆర్ఎస్ సర్కారు పనితీరును శంకించేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ ఎగుమతులను అందించే హైదరాబాద్ నగరానికి హైటెక్ సిటీ ప్రధాన కేంద్రంగా మారింది. హైటెక్ సిటీని గత ప్రభుత్వాలు భూములు కట్టబెట్టేందుకు నిర్మించినా.. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ ప్రాంత రూపురేఖలను మార్చేలా కేసీఆర్ సర్కారు కృషి చేసింది.
ఇందులో భాగంగా అంతర్జాతీయ వేదికలపై దిగ్గజ సంస్థలతో కేసీఆర్, కేటీఆర్ సారథ్యంలో పనిచేసిన ఐటీ, ఫార్మా పారిశ్రామిక రంగాలు ఊహించని స్థాయికి చేరాయి. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి సంస్థలకు హైదరాబాద్ సిటీ ప్రధాన కేంద్రాలుగా మార్చుకునేంత స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. అందులో భాగంగానే ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ సర్కారు రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 32 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం చేయాలని భావించి భూసేకరణ, అలైన్మెంట్, డిజైన్లు, టెండర్లు పూర్తి చేసి నిర్మాణ సంస్థలను ఎంపిక చేసింది. కానీ రీడిజైన్ పేరిట కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతోనే బహుళ ప్రయోజనాలు ఉండే ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేసింది.
32 కిలోమీటర్ల మేర 9 స్టేషన్లతో నిర్మించే రాయదుర్గం- ఎయిర్‌పోర్టు మార్గంలో పెద్ద భూసేకరణ సమస్యలు తక్కువే. ఇక ఐటీ, రెసిడెన్షియల్, హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలు శరవేగంగా విస్తరించడంతో అత్యంత రద్దీ కలిగిన ప్రాంతంగా మారింది. ఇప్పటికే పీక్ అవర్స్ లో ట్రాఫిక్ బంపర్ టూ బంపర్ తరహాలో సాగుతోంది. నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ఐటీ ఉద్యోగులకు రోడ్డు రవాణా ఇబ్బందిగా మారింది. ఇక నిర్మాణంలో ఉన్న బడా ఆఫీస్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పూర్తి అయితే… జనసాంద్రత విపరీతంగా పెరుగుతుంది.
ఇలాంటివి పరిగణనలోకి తీసుకొని బీఆర్ఎస్ సర్కారు ప్రజా రవాణాయే ఈ ప్రాంతానికి శ్రీరామ రక్షగా మెట్రో ప్రణాళికలు రూపొందించింది. దీంతో వ్యక్తిగత వాహనాలు తగ్గి, ట్రాఫిక్ ఫ్రీ ప్రాంతంగా మార్చేలా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరించాలని భావించింది. అందులో భాగంగానే మొత్తం ప్రాజెక్టులో రూ. 2వేల కోట్లను భూసేకరణ, సర్వేల కోసం కేటాయించి, కొంత మొత్తాన్ని కూడా అప్పటి సర్కారు మంజూరు చేసింది. కానీ ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కారు రద్దు చేసి ఈ ప్రాంతాన్ని ట్రాఫిక్ చక్రవ్యూహంలోకి నెట్టింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ కేంద్రంగా విస్తరిస్తున్న ప్రాంతాలకు అధునాతన రవాణా సదుపాయం లేకుండా చేసింది.
ఇక అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా మారిన రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, నార్సింగి, అప్పా జంక్షన్, మంచిరేవుల, రాజేంద్రనగర్, శాతంరాయి, శంషాబాద్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు నిర్మాణ రంగం మరింత పుంజుకునేది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో అనూహ్యంగా విస్తరించిన నిర్మాణ రంగంతో మెజార్టీ జనాలకు సొంత వాహనాల్లోనే ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు వినియోగిస్తున్నారు. కానీ మెట్రో నిర్మాణంతో 48వేల వాహనాల రాకపోకలు తగ్గిపోయేవి.
బీఆర్ఎస్ అంచనా ప్రకారమే 2023లోనే ప్రాజెక్టును మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే హద్దు రాళ్ల నిర్ధారణ, అలైన్మెంట్ మార్కింగ్ కూడా పూర్తి చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఎయిర్‌పోర్టు మెట్రోను అక్కసుతో రద్దు చేసింది. 32 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వచ్చే ఎయిర్‌పోర్టు మెట్రోతో దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు మెట్రోగా నగరానికి గుర్తింపు వచ్చేది.
పనులు మొదలైతే నిర్మాణ పనులు కూడా మొదలయ్యే అవకాశం ఉండేదని పలువురు నగరవాసులు అభిప్రాయపడ్డారు. కానీ అధికారంలోకి రావడంతోనే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిన ఐటీ కారిడార్ ఖ్యాతిని తగ్గించేలా రేవంత్ సర్కారు ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేసింది. ఇప్పటివరకు ఒక్క ఢిల్లీ మినహా ఏ ఒక్క మెట్రో నగరాల్లో ఎయిర్‌పోర్టు మెట్రో అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాతి స్థానం నగరానికి దక్కేది. ఇప్పటికే ముంబై, చెన్నై నగరాల్లో ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణంలో ఉండగా, ఇటీవలే బెంగళూరు, కోల్‌కతా మెట్రోలు అందుబాటులోకి వచ్చాయి. ఈ తర్వాతి జాబితాలోనైనా హైదరాబాద్ నగరం చేరేందుకు ఆస్కారం ఉండేది.
నిజానికి రాయదుర్గం-ఎయిర్‌పోర్టు వరకు మెట్రో అందుబాటులోకి వస్తే నిత్యం లక్షలాది మందికి ప్రయోజనం చేకూరేది. దాదాపు 25 నిమిషాల్లోనే ట్రాఫిక్ చక్రవ్యూహాన్ని ఛేదించుకొని ఎయిర్‌పోర్టుకు చేరుకునే వెసులుబాటు నగరవాసులు అందుబాటులోకి వచ్చేది. కొత్తగా నాగోల్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో అందుబాటులోకి వస్తే దూరం పెరిగినట్లుగానే.. ప్రయాణ కాలం కూడా పెరుగుతుంది. దీంతో కోర్ సిటీ నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు మరో 15-20 నిమిషాలు అదనంగా ప్రయాణిస్తే తప్ప.. సాధ్యం కానీ పరిస్థితులు కొత్త రూట్‌తో రానున్నాయి. ఇక ఈ మార్గంలో భూసేకరణ కూడా అత్యంత క్లిష్టంగా మారే అవకాశం ఉండగా… ఇవన్నీ ఛేదించుకొని మెట్రో అందుబాటులోకి రావడానికి మరో 8-10 ఏండ్ల సమయం పట్టే అవకాశమున్నది. అదే రాయదుర్గం మీదుగా మెట్రో నిర్మాణం పూర్తయి ఉంటే నాలుగేండ్లలోనే ఐటీ కారిడార్ మీదుగా అధునాతన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చేది.