LB Nagar | వనస్థలిపురం, మార్చి 20: బీజేపీ, కాంగ్రెస్‌లతో దేశమంతా ఒక విధానం ఎల్బీనగర్లో ఒక విధానంగా ఉందని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్‌రెడ్డి, జివి సాగర్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, పద్మానాయక్ అన్నారు. గురువారం వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెన్ నేత మధుయాష్కి సలహాలతో బీజేపీ కార్పొరేటర్లు పనిచేస్తున్నారన్నారు. నియోజకవర్గానికి వస్తున్న 80 శాతం నిధులు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మంజూరు చేయించినవే అన్నారు.
ఎన్జీవోస్ కాలనీలోని లైబ్రరీ గ్రౌండ్‌ను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే చూస్తుంటే బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి మధుయాష్కి చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. చంపాపేట కార్పొరేటర్ ఓ ఫంక్షన్ హాల్ కోసం మధుయాష్కి ఇంటి చుట్టూ తిరిగారన్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు కార్పొరేటర్లు అందరూ కలిసి వస్తున్నారని, ముగ్గురు మాత్రం కావాలనే రాజకీయం చేస్తూ, ప్రారంభమైన పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. అభివృద్ధికోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యేపై బురదజల్లేందుకు కుట్రలు చేయడం తగదన్నారు.