సిటీబ్యూరో, అక్టోబర్ 7 ( నమస్తే తెలంగాణ ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించడంతో కాంగ్రెస్, బీజీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. గులాబీ పార్టీని ఎదుర్కోవడం కష్టమనే నిర్ణయానికి ఆ రెండు పార్టీలు వచ్చేశాయి. దీంతో జాతీయ స్థాయిలో ప్రత్యర్థులుగా ఉన్న ఆ పార్టీలు రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి రహస్యంగా ఒక్కటైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా రహస్య దోస్తీ కట్టినట్టు సోషల్ మీడియాలో విస్త్రతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
రేవంత్ రెడ్డి, కిషన్రెడ్డి ఐక్య నిర్ణయంతోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ టికెట్ ఎవ్వరికి ఇవ్వాలనేది బీజేపీ అధిష్టానం కిషన్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అంటూ ప్రకటించింది. కిషన్ రెడ్డి ఎవరి పేరు చెబితే వారికి టెకెట్ దక్కుతుందని క్యాడర్ చర్చించుకుంటుంది.
దీంతో ప్రధానంగా కిషన్ రెడ్డి లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వడం పక్కాగా కనిపిస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లంకల దీపక్ రెడ్డిని కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రులకు పరిచయం చేయడం కూడా వైరల్గా మారింది. రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే బీజేపీ ఉప ఎన్నికలో నడుచుకుటుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
పైన పటారం.. లోన లొటారం
కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వం కలిసి పనిచేయాలని భావిస్తుంటే ఆశావహులు మాత్రం టికెట్ దక్కించుకోవడంపైన దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలియకుండా బీజేపీకి చెందిన ఆశావహులు పారిశ్రామికవేత్త కీర్తిరెడ్డి, ఎన్వీ సుభాష్, మాధవీలత, డాక్టర్ పద్మ వీరమనేని, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇప్పటికే లంకల దీపక్ రెడ్డి పేరును కిషన్ రెడ్డి ఖరారు చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తదితర పేర్లను కమిటీ పరిశీలిస్తున్నది. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఓడిపోయే సీటుకోసం జాతీయ స్థాయి ప్రత్యర్థులు కలిసి పనిచేస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బయటకి అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ అంతర్గతంగా మాత్రం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు పనిచేయనున్నట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
బీఆర్ఎస్ అభివృద్ధికి దడుచుకొని..
హైదరాబాద్ అభివృద్ధిలో బీఆర్ఎస్ ముద్ర స్పష్టంగా ప్రజల కండ్ల ముందు కనిపిస్తుంది. ఓవైపు ఐటీ కంపెనీలు, ఫ్లైఓవర్లు, రోడ్లు, తాగునీరు, నల్లా కనెక్షన్లు, దేశ చరిత్రలో లేని విధంగా 24 గంటల కరెంట్ ఇలా ఎన్నో అసాధ్యాలను సాధ్యం చేసి నగరాన్ని విశ్వనగరంగా మార్చింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సాక్ష్యంగా నిలుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్తో పోటీ అసాధ్యమని రేవంత్, కిషన్ రెడ్డి మంతనాలు చేసినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఏ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలో వారికి తెలియడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం డిపాజిైట్లెనా దక్కించుకోవాలనే ఆలోచనతోనే కలిసి పనిచేయడానికి రెడీ అయినట్టు సమాచారం. మొత్తంగా రెండు జాతీయపార్టీలు అభివృద్ధి సమయంలో నోరు మెదపకుండా ఎన్నికల స్వప్రయోజనాల కోసం రహస్య పొత్తు పెట్టుకుంటున్నారన్న ప్రచారంపై జూబ్లీహిల్స్ ఓటర్లు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.