Metro Phase-2 | సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని నార్త్ సిటీ ప్రాంతానికి కీలకమైన మెట్రో మార్గంపై సందిగ్ధత నెలకొంది. ఈ ప్రాంతాన్ని పార్ట్-బీలో చేర్చి డీపీఆర్ రూపకల్పన చేస్తామని మెట్రో సంస్థ ప్రకటించగా… గడిచిన 4 నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తమ ప్రాంతానికి మెట్రో ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు నార్త్ సిటీ ప్రాంతవాసులు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న జాప్యంతో నార్త్‌సిటీ ప్రాంతానికి తీరని నష్టం జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు డీపీఆర్ రూపకల్పన, ప్రభుత్వానికి చేరడానికి ఇంకెంత సమయం పడుతుందో అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి ప్రకటించినా..
నార్త్‌సిటీ ప్రాంతానికి మెట్రో లైన్‌ను విస్తరిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ డీపీఆర్ కూడా పూర్తికాలేదు. రెండో దశలో పార్ట్-బీగా నార్త్ సిటీతోపాటు, ఫ్యూచర్ సిటీ మెట్రో ప్రాజెక్టులను నిర్మిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. ఇందుకు 3 నెలల్లోగా డీపీఆర్ ప్రభుత్వానికి అందజేయాలని జనవరి 1న మెట్రో సంస్థను ఆదేశించింది. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో డీపీఆర్ ఎందుకు జాప్యం అవుతుందనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. గడిచిన నాలుగున్నర నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
ప్రాజెక్ట్ మనుగడపై అనుమానాలు..!
ఓవైపు ఎలివేటెడ్ కారిడార్, మెట్రో మార్గాలను వేర్వేరుగా నిర్మించాలనే ప్రతిపాదనలు తెరమీదకు రావడం, ఇప్పటికీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తి కాకపోవడం, ప్యారడైజ్ నుంచి వెళ్లాల్సిన మార్గాన్ని జేబీఎస్‌కు మార్చడం ఇలా నార్త్‌సిటీ విషయంలో ఇటీవల జరిగిన అంశాలన్నీ ప్రాజెక్టు మనుగడపై అనుమానాలను పెంచుతున్నాయి. ఇక ప్రభుత్వం కూడా నార్త్ సిటీ మెట్రోపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇవన్నీ కలిసి ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అయితే హెచ్ఏఎంఎల్ మాత్రం ఈ అంశాన్ని దాటవేసేలా, డీపీఆర్ తుది దశలో ఉందని, పలు మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని.. త్వరలోనే డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని చెబుతోంది.