Modi Kit | కవాడిగూడ, మార్చి 13 : ముషీరాబాద్‌లోని కశిష్ ఫంక్షన్ హాల్లో బీజేపీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రధాని మోదీ పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో బుధవారం తోపులాట, తొక్కీసలాట, ఘర్షణ చోటుచేసుకున్నది. తల్లీ బిడ్డల సంపూర్ణ ఆరోగ్యం కోసం ముషీరాబాద్‌లో బీజేపీ నాయకులు నిర్వహించిన మోదీ కిట్ల పంపిణీలో తల్లీ పిల్లలతో వందలాది మంది రావడంతో హాల్ అంతా కిక్కిరిసిపోయింది.
కిట్ల కోసం జనం ఎగబడడంతో హాల్లో చిన్నారులు, తల్లులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ముందుగా ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి ఎం.రమేశ్ రామ్ ఆధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరై మోదీ ఫౌష్టికాహార కిట్లను పంపిణీ చేస్తుండగా కిట్లు తమకు ముందుగా ఇవ్వాలని కూర్చున్నవారంతా ఒక్కసారిగా లేచి ఎగబడడంతో హాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
మోదీ కిట్లు 350 నుంచి 400 వరకు ఉండగా అంతకు రెండింతల మంది రావడంతో కిట్లు సరిపోవనే బావనతో మహిళలు మీదపడి లాక్కెళ్లారు. ఈ క్రమంలో డాక్టర్ లక్ష్మణ్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో తిరిగి మహిళలను సర్దిచెప్పి కిట్లను పంపిణీ చేస్తుండగా ఒక్కరొక్కరూ మూడు నుంచి నాలుగు కిట్లను లాక్కెళ్లారు. కిట్లు అందని మహిళలు బీజేపీ నాయకులను నిలదీశారు. పార్టీకి చెందిన కొందరు నాయకులు తమ తమ అనుయాయులకు మూడు నాలుగు కిట్లను అందజేయడంతో బీజేపీ నాయకులతో మహిళలు వాగ్వాదానికి దిగారు.
ఉదయం 8 గంటల నుంచి తాము హాల్ వద్ద పడిగాపులు కాచామని, తమకు కిట్లు అందకపోవడం బాధాకరమని మహిళలు ఆరోపించారు. కిట్ల కోసం హాల్ వద్దనే వందలాది మంది వేచిచూస్తుండడంతో పోలీసులు బయటకు వెళ్లగొట్టారు. దీంతో మోదీ కిట్ల కోసం హాల్‌కు వచ్చిన పసి పిల్లల తల్లులు, మహిళలు బీజేపీ నాయకులను శాపనార్థాలు పెడుతూ వెళ్లిపోవడం గమనార్హం..
తమ పిల్లలను వదిలిపెట్టి మోదీ కిట్ల కోసం మహిళలు ఎగబడడంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. చిన్నారులు తప్పిపోవడంతో అక్కడ ఉన్న పోలీసులు ఆ చిన్నారులను అక్కున చేర్చుకొని భుజాన ఎత్తుకొని ఈ చిన్నారులు ఎవరి బిడ్డలు, మోదీ కిట్లు కావాలా.. మీ పసిపిల్లలు మీకు వద్దా.. అంటూ మహిళల మధ్యన నిలబడి చెప్పడంతో ఆ చిన్నారుల తల్లులు వచ్చి మా పిల్లలు అంటూ దగ్గరకు వచ్చారు. దీంతో పోలీసులు మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిన్నారులను ఆ తల్లులకు అప్పగించారు.