కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రాజెక్టులన్నీ కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. అట్టహాసంగా మీరాలం చెరువు మీద కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తే… ఇప్పటికీ ఆ ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదు. ఆరు నెలల కిందట అధ్యయనం చేస్తామంటూ ట్రాన్సాక్షనల్ అడ్వైజరీకి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేయగా… ఇప్పటికీ అతీగతి లేకుండా పోయింది. కనీసం ఆ ఏజెన్సీ ఇప్పటికీ ఏం చేసిందనేది కూడా తెలియడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించుకున్న కీలకమైన ప్రాజెక్టుల విషయంలోనూ ఈ తరహా జాప్యం జరిగితే… ఇక పెండింగ్‌లో ఉన్న పనుల పరిస్థితి ఏంటని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
Mir Alam Cable Bridge | సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): మీరాలం చెరువును పర్యాటక ప్రాంతంగా, బెంగుళూరు హైవేకు రవాణా సదుపాయాలను మెరుగుపరిచేలా ఆధునీకరించాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరాలం బ్యూటిఫికేషన్‌పై అప్పట్లోనే కార్యాచరణ రూపొందించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా, ప్రాజెక్టు విధివిధానాలు, డీపీఆర్ రూపకల్పనపై హెచ్ఎండీఏ కసరత్తు చేసి ప్రభుత్వానికి అందజేసింది. అయితే తదనంతరం అధికారంలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. మీరాలం చెరువుపై నిర్మించే కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని గందరగోళంలో పడేసింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరకు పైగా గడుస్తున్నా కనీసం ఇప్పటికీ డీపీఆర్ కూడా ఖరారు కాలేదు.
హెచ్ఎండీఏ ప్రమేయం లేకుండానే..
వాస్తవానికి మీరాలం చెరువు అభివృద్ధికి చేపట్టాల్సిన నమూనాలను తీర్చిదిద్దేందుకు ఓ కన్సల్టెన్సీని హెచ్ఎండీఏ నియమించింది. ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి, పబ్లిక్-ప్రైవేట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సమగ్రమైన విధివిధానాలను రూపొందించే పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఖర్చు, ట్రాఫిక్ రద్దీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఏజెన్సీకి డీపీఆర్ సిద్ధం చేసే బాధ్యతలను అప్పగించేలా టెండర్లను పిలిచింది.
కానీ ఆ తర్వాత జరిగిన సమీక్ష సమావేశాలనుహెచ్ఎండీఏ ప్రమేయం లేకుండా నిర్వహించడంతో అసలు గందరగోళం మొదలైంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి.. హెచ్ఎండీఏ కమిషనర్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు లేకుండా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే అదే మీటింగ్‌లో ఎంఆర్డీసీఎల్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొనడంతో అసలు గందరగోళానికి కారణమైంది. బెంగుళూరు హైవే మార్గాన్ని మరింత విస్తరించేలా ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
బెంగుళూరు హైవే నుంచి చింతల్మెంట్ మీదుగా అత్తాపూర్ వరకు 2.65 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టుఅందుబాటులోకి వస్తే, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ, రవాణా దూరం తగ్గిపోవడంతోపాటు మీరాలం చెరువు పర్యాటక ప్రాంతంగా మారనుంది. దీనికి వీలుగా ప్రాజెక్టు డిజైన్ ఉండాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిపై వ్యూ డెక్, స్కై వాక్‌తోపాటు నెహ్రూ జువాలజికల్ పార్క్‌ను చేరుకునేలా డిజైన్ చేశారు. మీరాలం ట్యాంక్ ఆధునీకరణలో భాగంగా సైకిల్ ట్రాక్, పెడిస్ట్రీయన్ ట్రాక్ కూడా అందుబాటులోకి రానుంది.
మీరాలం వెంబడి పర్యాటక రంగానికి మరింత అవకాశం ఏర్పడుతుందని జూ పార్క్ సందర్శనకు వచ్చేవారికి అనువుగా ప్రాజెక్టు ఉండాలని ప్రణాళికలను గతంలోనే అధికారులు సిద్ధం చేశారు. కానీ ప్రకటనలకే పరిమితమవుతున్న కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్ట్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.