కోకాపేట్ ట్రంపెట్ ప్రారంభం ఎప్పుడనేది గందరగోళంగా మారింది. అట్టహాసంగా ప్రారంభ ఏర్పాట్లు చేసుకుంటే.. చివరి నిమిషంలో సీఎం రేవంత్ షెడ్యూల్ లేకపోవడంతో వాయిదా పడింది. ఇప్పటికీ కొత్వాల్‌గూడ’ సైతం అందుబాటులోకి రాలేదు.
సిటీబ్యూరో, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ) : కోకాపేట్ ట్రంపెట్ ప్రారంభం ఎప్పుడనేది గందరగోళంగా మారింది. అట్టహాసంగా ప్రారంభ ఏర్పాట్లు చేసుకుంటే.. చివరి నిమిషంలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ లేకపోవడంతో వాయిదా పడింది. నిర్మాణం పూర్తయి నెల రోజులు గడుస్తున్నా… అందుబాటులోకి రాలేదు. ఇదే తరహాలో కొత్వాల్‌గూడ ఎకో పార్క్ కూడా ఇప్పటికీ ప్రారంభంలేదు. రెండు వారాల కిందటే కోకాపేట్ ట్రంపెట్ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయగా, సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా వేశారు. దీంతో ట్రంపెట్ ఎప్పుడూ అందుబాటులోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది.
కోకాపేట్ నుంచి నియోపోలీస్, ఓఆర్ఆర్ మీదుగా రాకపోకలు వీలు కల్పించే ఈ జంక్షన్ నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు ప్రణాళికలు రూపొందించింది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఔటర్ మీదుగా మరిన్ని ఎక్కువ వాహనాలకు వీలు కల్పించేలా 22వ ఇంటర్ చేంజ్‌గా కోకాపేట్ జంక్షన్లో ఈ ట్రంపెట్‌ను దాదాపు రూ. 70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఇక నగరానికి అంతర్జాతీయ పర్యాటక అనుభూతిని కల్పించేలా వంద ఎకరాల విస్తీర్ణంలో బీఆర్ఎస్ సర్కారులో రూపకల్పన చేసిన కొత్వాల్‌గూడ ఎకో పార్కును గత నెలలోనే ప్రారంభించాలని అధికారులు భావించారు.
కానీ నిర్మాణ పనుల్లో కొంత జాప్యం కారణంగా వాయిదా పడింది. ఇటీవలే పనులన్నీ పూర్తయినా ప్రారంభానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఓఆర్ఆర్ మీదున్న ఈ రెండు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే అటు రవాణా సదుపాయాలతో పాటు, ఇటు పర్యాటక కేంద్రంగా ఔటర్ మారుతుంది. కాగా, కోకాపేట్ ట్రంపెట్ ప్రారంభోత్సవానికి హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. కానీ ప్రాజెక్టు ఆవిష్కరణ అర్ధాంతరంగా వాయిదా పడటం ఉన్నతాధికారులను కూడా విస్మయానికి గురి చేసింది. అయితే నిర్మాణం పూర్తయిన ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడతాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.