మిక్సర్ యంత్రాలపై ఇష్టానుసారంగా జరిమానాలు విధించడాన్ని ఆర్టీఏ, పోలీసులు మానుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హెచ్చరించారు. ఒక్కో మిక్సర్ యంత్రంపై రూ.25 వేలపైనే జరిమానాలు విధిస్తూ తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని ప్రభుత్వంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ఇచ్చిన బంద్ విజయవంతమైంది. కాగా ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన వందలాది మంది కార్మికులు నిరసన చేపట్టారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేసినా గేటును తోస్తూ లోపలికి చొచ్చుకుని పోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం రవాణా శాఖ ప్రధాన కార్యాలయం ముందర వందలాది మంది కార్మికులు బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం దిగిరావాలి.. జరిమానాలు మానుకోవాలి అంటూ నినదించారు.
– సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ)
మిక్సర్ యంత్రాలపై ఇష్టానుసారంగా జరిమానాలు విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హెచ్చరించారు.మంగళవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన వందలాది మంది కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా నుంచి వలస వచ్చిన నిరుపేద కూలీలపై ఆర్టీఓలు, పోలీసులు తమ ప్రతాపం చూపిస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పూట నిర్మాణ ప్రాంతానికి ట్రాక్టర్లలో సామాగ్రిని తీసుకువెళ్తుంటే అడ్డుకొని, ఏకంగా రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు భారీ చలాన్లు విధిస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీఏ మొబైల్ స్వాడ్ల పేరుతో ప్రతిరోజూ వేధింపులకు గురిచేయడం కార్మికుల జీవనోపాధిని దెబ్బతీయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రోశయ్య ప్రభుత్వమే కాంక్రీట్ మిల్లర్ సామాగ్రిని తీసుకువెళ్లేందుకు స్పష్టమైన అనుమతులు, రవాణా మినహాయింపులు ఇచ్చిందని వారు గుర్తుచేశారు. కాంక్రీట్ సామాగ్రి మిక్సర్ యంత్రం అనేది ఎలాంటి మోటార్ వాహనం కిందకు రాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, అధికారులు వాటిని బేఖాతరు చేస్తూ దౌర్జన్యానికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్టంలో లేని నిబంధనలను సృష్టించి తమపై చలాన్లు ఎలా విధిస్తారని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కొంతమంది ఆర్టీఏ కానిస్టేబుళ్లు నేరుగా డబ్బులు డిమాండ్ చేస్తూ కార్మికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజూ 20 నుంచి 30 మిల్లర్లను అడ్డుకొని లంచాలు అడగడం, ఇవ్వని పక్షంలో సామాగ్రిని సీజ్ చేయడం పరిపాటిగా మారిందన్నారు. జీవనాధారం లేక స్వతహాగా తయారుచేసుకున్న మిల్లర్ సామాగ్రిని సైతం నగరంలో లేకుండా చేయాలనే కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.
పెద్దపెద్ద భవనాల నిర్మాణాలకు మిల్లర్లను వాడుకొని, ఇప్పుడు పనులు ముగిసి ఆ భవనాల్లోకి అధికారులు రాగానే కార్మికులను వెళ్లగొట్టే ప్రయత్నం చేయడం ఎవరి లబ్ధి కోసమని ప్రశ్నించారు. కొంతమంది ఆర్ఎంసీ ప్లాంట్ల ప్రయోజనాల కోసం మిల్లర్లు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం నాలుగు జోన్ల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, సత్యనారాయణ, రాములు, శాంతన్న మాట్లాడుతూ.. వ్యవసాయ ట్రాక్టర్ కు పిలర్లను తట్టించుకునేలా మినహాయింపు ఇవ్వాలన్నారు.
ఆటోలకు ఇచ్చిన విధంగానే కాంక్రీట్ మిల్లర్ కార్మికులకు, వారు సామాగ్రి తీసుకువెళ్లే ట్రాక్టర్లకు టాక్స్ మినహాయింపును పూర్తిగా కొనసాగించాలని తెలిపారు. రవాణా శాఖ మొబైల్ స్వాడ్ల వేధింపులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్లకు ఇసుక కంకర వేసేందుకు ఏర్పాటు చేసుకున్న బకెట్లకు అనుమతులు ఇవ్వాలని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి మిల్లర్ల విషయంలో స్పష్టమైన హామీ, మినహాయింపులు ఇవ్వని లేని పక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాలను కచ్చితంగా అడ్డుకుంటామని నాయకులు హెచ్చరించారు. అసెంబ్లీ ముందే తమ మిల్లర్ల సామాగ్రిని అన్నింటినీ తీసుకువచ్చి నిరసన తెలుపుతామని, దానివల్ల ఎలాంటి నష్టం జరిగినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
కాగా అధికారులు స్పందించి మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించి ఐదు రోజుల్లో సమస్యను పరిషరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు నిరసన ఆపేశారు. అసోసియేషన్ సలహాదారులు వీరయ్య, ఈ తిరుపతయ్య, మాధవ రెడ్డి, శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుల్తాన్ నాయుడు, జాయింట్ సెక్రటరీ భరత్, నాయకులు పరశురాం వెంకటేశ్, రాంచందర్ లతోపాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.