ఉస్మానియా యూనివర్సిటీ: గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులు తమ భవితవ్యంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ పరీక్ష తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్‌ను రద్దు చేయాలని, జవాబు పత్రాలను ఎనిమిది నెలల్లో తిరిగి మూల్యాంకనం చేయాలని, లేనిపక్షంలో పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించిందని గుర్తు చేశారు.
దీనిపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిందని చెప్పారు. కోర్టు తీర్పుపై అప్పీలు చేసుకోవడం కమిషన్‌కు హక్కుగా ఉండవచ్చని, కానీ దాదాపు మూడు లక్షల మంది అభ్యర్థుల భవితవ్యంతో ముడిపడి ఉందని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నిరుద్యోగుల్లో నమ్మకం కల్పించడంలో టీజీపీఎస్సీ విఫలమైందని మండిపడ్డారు. దీనిప్రభావం రాష్ట్రంలో 40 లక్షల నిరుద్యోగులపై పడుతుందని చెప్పారు. ఇప్పటికైనా టీజీపీఎస్సీ స్పందించి, పరీక్షను తిరిగి నిర్వహించాలని, లేనిపక్షంలో రీవాల్యుయేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే నిరుద్యోగులు మరో పోరాటానికి సిద్ధమవుతారని హెచ్చరించారు.
గ్రూప్-1 పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ బుధవారం నాటికి మూడో రోజుకు చేరుకున్నది. ఇందులో భాగంగా ఓయూ మెయిన్ లైబ్రరీలో సంతకాలు సేకరించేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ గ్రూప్- 1 పరీక్షను రద్దు చేయడంతో పాటు అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లక్ష సంతకాలను సేకరించి సమర్పించనున్నట్లు వివరించారు. నిరుద్యోగుల సంతకాలు సేకరిస్తుంటే ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.