Electricity Bill | సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ‘నా జూలై నెల విద్యుత్ బిల్లు చెల్లింపు ఇప్పటి వరకు జమ కాలేదు. ఇప్పుడు నాకు కొత్త బిల్లు వచ్చింది. మీరు నా రూ. 524.00ల మొత్తాన్ని క్రెడిట్ చేసే వరకు నేను ఈ నెల విద్యుత్ బిల్లును చెల్లించను.. ఉన్నతాధికారులకు బిల్లు చెల్లించినట్లు ఆధారాలు పంపినా సరి చేయలేదు.. ఇలా ఎందుకు ఆలస్యం అవుతోంది’… అంటూ ఓ విద్యుత్ వినియోగదారుడు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పోస్టు చేశారు.
ఇలా ఒక్కరే కాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా మంది వినియోగదారులు బిల్లుల చెల్లింపులో ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. జూలై ప్రారంభానికి కొద్ది రోజుల ముందు థర్డ్ యాప్‌ల నుంచి చెల్లించే అవకాశాన్ని తొలగించడంతో కొన్ని రోజుల పాటు వినియోగదారులు ఇక్కట్లకు గురయ్యారు.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ప్రత్యేకంగా సంస్థ మొబైల్ యాప్‌లోనే బిల్లుల చెల్లింపు ఆప్షన్ తీసుకువచ్చినా.. కొన్ని రోజుల పాటు సరిగా పనిచేయలేదు. కొందరు యాప్‌లో చెల్లింపులు చేస్తే సరైన స్పందన ఉండడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో మీ సేవా కేంద్రాలకు వెళ్లి కట్టాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.