కంటోన్మెంట్, జనవరి 6 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నదని, మోసాలకు ఆ పార్టీ మారుపేరని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో రూ.15 వేలు ఇస్తామని ఊదరగొట్టి, ఇప్పుడు రూ.12 వేలు మాత్రమే ఇస్తామని మోసం చేస్తున్నదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. రైతు భరోసాపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం కంటోన్మెంట్‌లోని జూబ్లీ బస్ స్టాండ్ చౌరస్తా వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫ్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎన్నో హామీలను ఇచ్చిందని రైతుభరోసా రూ.12 వేలు కాకుండా ఇచ్చిన హామీ ప్రకారం రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్‌కు గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథం, అనితాప్రభాకర్, నళినికిరణ్తో పాటు నేతలు రామకృష్ణ, శ్రీకాంత్, శ్రీధర్, విజయ్, శ్రీనివాస్‌తో పాటు ఆయా వార్డుల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు.