సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : బడా బాబుల అవినీతి గురించి విన్నాం.. కానీ ఓ సాదాసీదా కంప్యూటర్ ఆపరేటర్ చేతివాటం చూసి కాంట్రాక్టర్లు రగిలిపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సికింద్రాబాద్ జోనల్ ఆఫీసులో ఓ కంప్యూటర్ ఆపరేటర్ సాగిస్తున్న దందా ఇప్పుడు కార్పొరేషన్ వర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. లంచం ఇస్తేనే ఫైలు కదులుతుందని, లేదంటే కొర్రీలు పెడుతూ వేధిస్తున్నాడని పేరొంటూ సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కాంట్రాక్టర్లు సామూహికంగా జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్, బేగంపేట, ముషీరాబాద్, మలాజిగిరి, అంబర్ పేట సరిళ్ల పరిధిలో సివిల్ పనులు చేసే కాంట్రాక్టర్లు ఈ ఫిర్యాదులో పలు సంచలన విషయాలను వెల్లడించారు. జోనల్ కమిషనర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి ప్రతి చిన్న పనికి, ఫైలు ప్రాసెసింగ్‌కు రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు డిమాండ్ చేస్తున్నాడని సదరు ఫిర్యాదులో ఆరోపించారు.
నగదు ముట్టజెప్పనిదే ఏ ఫైలూ ముందుకు కదలని పరిస్థితి నెలకొందని వారు వాపోయారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రతిష్టను దిగజారుస్తూ, అవినీతికి పాల్పడుతున్న సదరు ఆపరేటర్‌పై తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు అతడిని విధుల్లోంచి తొలగించాలని కోరుతూ డిసెంబర్ 31న జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు పత్రాన్ని (ఇన్వర్డ్ నం. 5326) సమర్పించారు. అధికారుల అండదండలు లేకుండానే ఇంత ధైర్యంగా వసూళ్లు చేస్తున్నాడా? లేక వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ జరపాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. ఐతే జోనల్ కమిషనర్ తక్షణమే స్పందించి జూనియర్ అసిస్టెంట్‌ను నియమించి దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది.