మియాపూర్ :శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో అత్యున్నత అధికారి లాగిన్‌ను దుర్వినియోగం చేసే ప్రయత్నం బయటపడడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై వేటు వేశారు. పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఈ ప్రయత్నం చేసినట్లు గుర్తించి చర్యలకు ఉపక్రమించారు జోనల్ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అభిలాష్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి.
కొద్దిరోజుల కిందట రాత్రి సమయంలో కార్యాలయంలో జోనల్ కమిషనర్ లాగిన్‌ను తెరిచే ప్రయత్నం చేశాడు. వెంటనే సంక్షిప్త సందేశం జోనల్ కమిషనర్ ఫోన్‌కు వెళ్లడంతో ఆయన అప్రమత్తమయ్యారు. ఉన్నత అధికారులను అప్రమత్తం చేసి తన లాగిన్ దుర్వినియోగం చేసే ప్రయత్నం గురించి తెలిపారు. ఈ చర్యకు పాల్పడ్డ ఉద్యోగి ఎవరన్న విషయమై అంతర్గతంగా, సాంకేతికంగా విచారించారు.
అభిలాష్ అనే ఔట్సోర్సింగ్ ఉద్యోగి జోనల్ కమిషనర్ లాగిన్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించినట్లు నిర్ధారించుకొని సదరు ఉద్యోగిపై వేటు వేశారు. సదరు ఉద్యోగి సేవలు తమకు అవసరం లేదని కాంట్రాక్టు సంస్థకు లిఖితపూర్వకంగా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఇతర ఉన్నతఅధికారుల లాగిన్లు సైతం ఏమైనా దుర్వినియోగం అయ్యి ఉంటాయా? అనే కోణంలో అధికారులు అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.