Samagra Survey | సిటీబ్యూరో: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మందకొడిగా సాగుతున్నది. తొలి రోజు తరహాలోనే రెండో రోజూ ఆదివారం ఎన్యుమరేటర్లకు అడుగడుగునా ప్రభుత్వ వ్యతిరేకత, సర్వేలో శాస్త్రీయత, సమగ్రత, చిత్తశుద్ధి లోపించిందని ప్రజలు చాలా చోట్ల విముఖత వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులకే దిక్కులేదని, ఈ సర్వేలో ఏం ఉద్దరిస్తారంటూ మండిపడుతున్నారు.మరికొందరు రుణాల విషయంలోనూ వ్యతిరేకత వస్తున్నదని చెబుతున్నారు.
గ్రేటర్లో చాలా కుటుంబాల్లోని వ్యక్తులు ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఆస్తులకు సంబంధించిన విషయంలో గోప్యత పాటిస్తున్నారని చెబుతున్నారు. చాలా మందికి ఇండ్లు, బంగ్లాలు, కార్లు, లారీలు ఉన్నప్పటికీ వాటి వివరాలు చెప్పడం లేదని, ఆధార్ కార్డు నంబర్ ఇవ్వడానికి సైతం వెనుకాడుతున్నట్లు చెబుతున్నారు. కాగా, అంబర్‌పేట, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాలోని పలు ప్రాంతాల్లో ఫారాల కోసం ఎన్యుమరేటర్లకు ఎదురుచూపులు తప్పడం లేదు.
ఫారాల ప్రింటింగ్ బాధ్యతలు అప్పగించేందుకు జీహెచ్ఎంసీ టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడంలో సకాలంలో ఫారాలు అందడం లేదు. కాగా, సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు, సుమారు 75 అంశాలకు సంబంధించిన సమాచారం ఫీల్ (భర్తీ) చేయాలంటే ఒక్కొక్క ఇంటికి సర్వే చేసేందుకు సుమారు అరగంటకు పైగా సమయం తీసుకుంటున్నది. భార్య, భర్తల వివరాల నమోదుకే 25 నుంచి 30 నిమిషాల సమయం పడుతున్నదని, ఇంట్లో నలుగురు సభ్యులున్న కుటుంబ వివరాల నమోదుకు 50 నిమిషాల సమయం పట్టడం సర్వే నిర్వహణ తీరుకు అద్దం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తం 29, 58, 277 ప్రాజెక్టెడ్ కుటుంబాల గణన ఇంటి సర్వేలో 150 గృహాలకు ఒక ఎన్యూమరేటర్ బ్లాక్‌గా గుర్తించి.. 19, 722 ఎన్యూమరేటర్లను నియమించారు. రెండో రోజు 69, 624 కుటుంబాల్లో సర్వే పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. సర్వే ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడానికి జోన్ వారీగా ఐఏఎస్‌లకు సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించామన్నారు. డేటా ఎంట్రీ ప్రక్రియలోకి తీసుకునేందుకు బల్దియా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.