సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : మిరాలం చెరువులోకి చుక్క మురుగునీరు చేరకుండా చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. ఎస్టీపీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. జలమండలి ఎస్టీపీ ప్రాజెక్టు ప్యాకేజీ-2లో భాగంగా నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సోమవారం జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖ, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి ఎండీ దానకిశోర్ పరిశీలించారు. 41.5 ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీ పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా అక్కడున్న పైపులైన్లను అనుసంధానం చేసి కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీలోకి మళ్లించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వీటిని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, నీటి పారుదల శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని సూచించారు. పని జరిగే ప్రదేశంలో రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెలాఖరులోగా ట్రయల్ రన్ పనులు చేపట్టి, ప్రారంభానికి ఎస్టీపీని సిద్ధం చేయాలని ఎండీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈడీ డాక్టర్ ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్‌బాబు, ఎస్టీపీ సీజీఎం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.