ఘట్ కేసర్, మార్చి 3: ఆలుమగల తగాదాలో జరిగిన ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతున్న వివాహిత మరణానికి ఆమె భర్తే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఘట్ కేసర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల మేరకు ఎదులాబాద్ గ్రామానికి చెందిన ఎదుగని శ్రీనివాస్ అనురాధ(52) భార్యాభర్తలు వీరికి కుమార్తె మానస, కుమారుడు పూర్ణచందర్ సంతానం ఉండగా 5 సంవత్సరాల క్రితం కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శ్రీనివాస్ మద్యానికి బానిసై ఏ పనులూ చేయకుండా ఉండటంతో భార్య అనురాధ క్యాటరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. కాగా గత కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకొన్న శ్రీనివాస్ నిత్యం గొడవలు పడుతుండేవాడు.
గత నెల 28న భార్యతో గొడవ పడి కొట్టడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరుసటి రోజు ఘట్ కేసర్ లోని ప్రభుత్వ దవాఖాన కు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున అనురాధ మృతిచెందింది. శవాన్ని ఎదులాబాద్ లోని ఇంటికి తరలించగా భర్త శ్రీనివాస్, కూతురు మానస వెంట రాలేదు. దీంతో అనుమానించిన అనురాధ సోదరుడు కాలేరు నర్సింగ్ రావు ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులు, ఫర్నిచర్ చిందర వందర పడి ఉండడంతో గొడవ చేసి గాయపరిచినట్లు నిర్ధారణకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త శ్రీనివాస్ దాడి చేసి హత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.