మలక్‌పేట, జనవరి 3: అధికార దాహంతో అమలుకు సాధ్యం కాని 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి ఏడాది గడుస్తున్నా వాటిని అమలు పర్చకపోవటంతో దళిత బిడ్డలు ఆగ్రహం చెందారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజ నర్సింహ, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రచురితమైన దిన పత్రికల క్లిప్పింగులను కూడా వారు జతపరిచారు.
2023 ఆగస్టు 26న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్లలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారని, ఆ సభలో మల్లికార్జున ఖర్గే, రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహలు మాట్లాడుతూ.. “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, ఉప కులాల కార్పొరేషన్లు వేర్వేరుగా ఏర్పాటు చేస్తామని, ఎస్సీ రిజర్వేషన్లను పెంచుతాం” అని హామీ ఇచ్చారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంబేద్కర్ అభయ హస్తం కింద రూ.12 లక్షల ప్రత్యేక పథకం, దళిత సమాజానికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని, పదో తరగతి పాసైన విద్యార్థులకు విద్యా జ్యోతి పథకం ఏర్పాటు చేస్తామని హమీలు ఇచ్చారని వారు పేర్కొన్నారు. మాదిగల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటంతో వారి మాటలను నమ్మిన రాష్ర్టంలోని 70 లక్షల మంది దళితులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారని వారు ఫిర్యాదు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి వినతి పత్రాలు సమర్పించామని, అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా సీఎం రేవంత్ మాదిగలను మోసం చేశారని వారు అన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీకి చైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయినాయని, రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించాలని వినతి పత్రాలు సమర్పించినా సీఎం స్పందించలేదని, అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ చట్టాలను సైతం ఉల్లంఘించారని వారు పేర్కొన్నారు.
అధికార దాహంతో హామీలు ఇచ్చి అమలు పరుచని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు, మంత్రులు దామోదర రాజ నర్సింహ, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ (కేఎస్బీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిని ఎల్లేష్ మాదిగ, మాదిగ యువసేన గ్రేటర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇంద్రకంటి సూరి మాదిగ, దర్శనం రామస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి మారేపల్లి బాబూరావు మాదిగ, రాష్ట్ర మహిళా నాయకురాలు జంబూల అరుణ బైండ్ల లు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వారు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన మలక్‌పేట ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేశ్ న్యాయ సలహాల మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు.