సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): సున్నంచెరువులో కూల్చివేతల బాధితులు సియేట్ సొసైటీ వాసులు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతికి హైడ్రాతో పాటు స్థానిక పోలీసులపై ఫిర్యాదు చేశారు. పలు దఫాలుగా కోర్టు ఆర్డర్లతో పాటు తాము ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ సీపీకి ఫిర్యాదు చేసినా.. స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తామంతా సీనియర్ సిటిజన్స్ అంటూ తమకు, హైడ్రాకు మధ్యలో కోర్టు కేసు నడుస్తున్నదని, గుట్టల బేగంపేటకు సంబంధించిన 12,13 సర్వే నంబర్లలో ఉన్న తమ ప్లాట్లలో ఎక్కడా తవ్వకాలు చేయడం, ఫెన్సింగ్ వంటి పనులు చేపట్టవద్దని కోర్టు స్టేటస్కో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ హైడ్రా వాటిని పాటించడం లేదని పేర్కొన్నారు.
కోర్టు ఉత్తర్వులను కాదని తమ స్థలాల్లో డిగ్గింగ్ చేస్తుంటే తాము అడ్డుకున్నప్పటికీ పోలీసులు తమనే తీసుకెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు పీఎస్లో ఉంచారని, వారు హైడ్రా, ఇతర ఏజెన్సీలకు సహకరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా, జిహెచ్ఎంసి, రెవెన్యూ, పోలీస్ , హెచ్ఎండీఏ తదితర సంస్థలు తమ స్థలాల్లో కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని స్పష్టంగా ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా మాత్రం గుంతలు తీసిందని వారు తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఫిర్యాదును ఈనెల 18న సీపీ కార్యాలయంలోని ఇన్వార్డ్లో ఇచ్చామని ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులకు సీపీ కార్యాలయం నుంచి సియేట్ కాలనీ వాసుల ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినా.. వారు పట్టించుకోవడం లేదని తెలిసింది. ఇది సివిల్ వివాదమని , ఇందులో తాము జోక్యం చేసుకోలేమని పోలీసులు చెబుతున్నట్లుగా సియేట్ కాలనీ వాసులు చెప్పారు. హైడ్రా తమ భూముల్లోకి వచ్చి ట్రెస్పాస్ చేస్తుంటే అది సివిల్ వివాదం ఎలా అవుతుందని పోలీసులను సియేట్ కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. రిటైరయి, 80 ఏండ్ల వయసున్న తమను ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయంలో తగిన రీతిలో న్యాయం చేయాలని సియేట్ సొసైటీ ప్రతినిధులు సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.