Nadargul |సామాన్యుడు గుడిసె వేస్తే ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ భూములు అంటూ కాంగ్రెస్ సర్కార్ కన్నెర్రజేస్తున్నది. బుల్డోజర్లను పంపి వాటిని పేకమేడల్లా కూల్చుతున్నది. కానీ, నాదర్గుల్లో కండ్ల ముందే 373.22 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలు చెరపడితే మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. బాగోతం మొత్తం బయటపడినా కిక్కురుమనడం లేదు. రూ.6 వేల కోట్ల విలువైన భూములను కాపాడాల్సింది పోయి, జిల్లా కలెక్టర్ మొదలు రెవెన్యూ యంత్రాంగమంతా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఇదే అదనుగా ఆ భూముల్లోకి ఒక్కొక్కటిగా ప్రైవేట్ కంపెనీలు గద్దల్లా వాలిపోతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలకే సవాల్ విసురుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు చెందినవే కావడంతో అధికార యంత్రాంగం కావాలనే మొద్దు నిద్ర నటిస్తున్నది.
స్పెషల్ టాస్క్బ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): నాదర్గుల్లోని రూ.6 వేల కోట్ల విలువైన భూములపై ఒక్కొక్కటిగా ప్రైవేట్ కంపెనీలు గద్దల్లా వాలుతున్నాయి. 373.22 ఎకరాల భూముల చుట్టూ వేసిన రేకుల ప్రహరీ ప్రధాన గేటుపై ఇన్నాళ్లూ కోహినూర్ నిర్మాణ సంస్థ పేరు మాత్రమే ఉండేది. తాజాగా మరో రెండు కంపెనీలు వచ్చి చేరాయి. మూడు కంపెనీలు సంయుక్తంగా భూములను అభివృద్ధి చేస్తున్నట్టు ‘జాయింట్ డెవలప్మెంట్’ అని స్పష్టంగా రాశారు. ఆయా కంపెనీలు అధికారికంగా ప్రకటించనప్పటికీ వివాదాస్పద భూము ల వద్ద వాళ్ల అనుమతి లేనిదే పేర్లు రాస్తారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లోకి వెళ్లకుండా తమను రోడ్డున పడేశారంటూ నాదర్గుల్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం చకోర పక్షుల్లా తిరుగుతున్నారు. తాజాగా రంగారెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లి న్యాయం చేయాలని డీఆర్వో సంగీతకు వినతిపత్రం అందజేశారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ సర్వే నంబర్ 613లోని 373.22 ఎకరాల భూములకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది. ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకూ ప్రయత్నించడం లేదు. ప్రైవేట్ నిర్మాణ సంస్థలు తిష్ట వేసినా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. గతం లో ఆ భూముల్లో ప్రొటెక్టెడ్ టెనెంట్స్(రక్షిత కౌలుదార్లు) ఉన్నారని అధికారులు తేల్చారు. ఈ మేరకు రైతులను కూడా ఆ భూముల్లోకి పోనీయడం లేదు. విషయం బయటపడి రోజులు గడుస్తున్నా రెవెన్యూశాఖ ఇంకా నివేదిక రూపకల్పనలోనే కాలం గడుపుతున్నది. ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీయడం కొనసాగిస్తూనే ఉన్నది. మంగళవారం బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయానికి వచ్చి సర్వే నంబర్ 613కు సంబంధించి అనుమతులు ఇచ్చారా? ఇతర డాక్యుమెంట్లు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? అని ఆరా తీశారు. ఆ భూముల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు తమను అరెస్టు చేస్తూ, సదరు నిర్మాణ సంస్థలకే వత్తాసు పలుకుతున్నారని నాదర్గుల్ రైతులు ఆరోపిస్తున్నారు. ఏడు దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్లోకి తమను రానీయకుండా దౌర్జన్యం చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతున్నారు. మొత్తంగా రూ.6వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వ పెద్దల చేతిలో పప్పుబెల్లాల్లా మారిపోయాయి.

నాదర్గుల్ భూముల వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దలే నడిపిస్తుండటంతో అధికార యంత్రాంగం మౌనం వహిస్తున్నది. దీంతో నిషేధిత జాబితాలో భద్రంగా ఉన్న 373.22 ఎకరాల భూములు ఒక్కొక్కరి చేతులు మారుతున్నాయి. క్షేత్రస్థాయిలోకి అనేక కంపెనీలు వచ్చి చేరుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములు అని నమోదవుతూ వస్తున్నా, శివరాజ్ బహదూర్ వారసుల నుంచి ఒక వ్యక్తికి డీజీపీఏ, ఆపై ఆయన మూడు కంపెనీలకు సేల్‌డీడ్, ఆ తర్వాత ఈ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టడం… ఇలా చేతులు మారుతూనే ఉన్నాయి. కొన్నిరోజుల కిందట ఒక నిర్మాణ సంస్థ తమకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేశారంటూ ప్రహరీ నిర్మాణం కోసం బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. కోహినూర్ అనే కంపెనీ ఆ భూములను స్వాధీనం చేసుకొని చుట్టూ రేకుల ప్రహరీ నిర్మించి ప్రధాన గేటుపై.. ఈ భూములు కోహినూర్ గ్రూప్‌నకు చెందుతాయని రాసింది. ఆదిబట్ల పోలీసులు ఏకంగా దానికి కోహినూర్ వెంచర్‌గా నామకరణం చేశారు. తాజాగా మంగళవారం మరో రెండు కంపెనీల పేర్లు వచ్చి చేరాయి. ప్రధాన గేటుపై ‘జాయింట్ డెవలప్మెంట్’ అంటూ ఎంఈఐఎల్(మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్)తో పాటు శిల్పా ఇన్ఫ్రా కంపెనీల పేర్లు రాశారు. మేఘా కంపెనీ ఎవరిదనేది, వారికి ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. శిల్పా ఇన్ఫ్రా గురించి వాకబు చేయగా, దానికి అనుబంధంగా ఉన్న పలు కంపెనీల్లో ఓ మంత్రి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నట్టు తేలింది. అందుకే ప్రభుత్వ భూముల్లోకి ప్రైవేట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వచ్చి చేరుతూ ‘ఏం చేసుకుంటారో చేసుకోండి!’ అని ప్రభుత్వ వ్యవస్థలకు సవాల్ విసురుతున్నాయని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.