పోలీసుశాఖ ఆధ్వర్యంలో అనేక అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా.. షీటీమ్స్ నిఘా పెట్టినా.. అతివలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. గతంలో కన్నా ఈ ఏడాది మహిళలపై హత్యలు, వరకట్న కేసులు, లైంగిక వేధింపుల సంఖ్య పెరిగింది. గతేడాదితో పోలిస్తే మహిళలపై నేరాల సంఖ్య 6 శాతం పెరిగింది. 2024లో 2482 కేసులు నమోదైతే 2025లో 2625కు పెరిగాయి.. అదే విధంగా చిన్నపిల్లలపై నేరాల విషయంలోనూ గతేడాదితో పోలిస్తే 27 శాతం పెరిగింది. చిన్నారులపై నేరాలు (పోక్సో) 449 నమోదు అవ్వగా, 2025లో 568 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రేప్ కేసులు 405, హత్యలు 69, కిడ్నాప్‌లు 166 నమోదు అయ్యాయి.
ఈ మేరకు శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2025 వార్షిక క్రైమ్ నివేదికను సీపీ సజ్జనార్ విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 19,831 కేసులు నమోదు కాగా.. కోర్టులో 4,463 మందికి శిక్షలు పడ్డాయని సీపీ తెలిపారు. మహిళల హత్యలు ఎక్కువగా కుటుంబకలహాలతోనే జరిగాయని చెప్పారు. షీటీమ్స్‌కు సంబంధించి 1,114 కేసులు నమోదవ్వగా, 3817 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్ స్మైల్ కింద 896 మంది పిల్లలను రెస్క్యూ చేశామని, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో 1,247 మందిని రక్షించినట్లు చెప్పారు.

సిటీబ్యూరో, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగాయని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ 15 శాతం తగ్గగా, హైదరాబాద్ కమిషనరేట్‌లో కేసుల సంఖ్య 2024తో పోలిస్తే 14 శాతం తగ్గిందని చెప్పారు. నగరంలో మొత్తం 2024లో 35,944 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 30,690 కేసులు నమోదు అయినట్లు చెప్పారు. అలాగే సైబర్‌క్రైమ్‌పై అవగాహన పెంచడంతో ఈసారి నేరాలు తగ్గాయని తెలిపారు. సోషల్‌మీడియాలో అన్ని నేరాలపై దాదాపుగా అవగాహన కార్యక్రమాల ద్వారా యువతకు, ప్రతీ ఒక్కరికీ నేరం జరిగే తీరును వివరిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు నగర పరిధిలో మొత్తం 3,735 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
పెట్టుబడి మోసాలకు సంబంధించి 740 కేసులు, మ్యాట్రిమోనీ మోసాలు 12, వాట్సాప్ డీపీ మోసాలు 8, జాబ్పేరుతో మోసాలు 43, ఓటీపీ మోసాలు 458 నమోదైనట్లు వెల్లడించారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో 26,379 ఫిర్యాదులు అందాయని, రూ.319 కోట్లు నష్టం జరగగా అందులో రూ.54కోట్లను హోల్డ్ చేసినట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరం కంటే సైబర్‌నేరాలు 8 శాతం తగ్గినట్లు సజ్జనార్ పేర్కొన్నారు. సైబర్‌క్రైమ్ బృందాలు మెరుగుగా పనిచేయడంతో ఈ ఏడాది 566 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశామని చెప్పారు. ప్రతీ మంగళ, శనివారాల్లో ప్రజల్లోకి వెళ్లి అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని, దీనికి మంచి స్పందనే ఉన్నా.. అత్యాశకు హద్దు ఉండదని, ఇందులో భాగంగానే కొంతమంది సైబర్‌నేరస్తుల బారిన పడుతున్నారన్నారు.
ఇక ట్రాఫిక్ విషయానికొస్తే ట్రాఫిక్ మేనేజ్మెంట్ నగరవాసులకు పెద్ద సమస్యగా మారిందని సజ్జనార్ తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. హెల్మెట్ లేకుండా, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్, త్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, సీట్‌బెల్ట్ లేకుండా ప్రయాణించినవి ఇలా దాదాపు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు గతేడాదితో పోలిస్తే పెరిగాయని చెప్పారు. ఈసారి మైనర్ డ్రైవింగ్ కేసులు విపరీతంగా పెరిగాయని, గత సంవత్సరం 3,283 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 7,808 కేసులు నమోదు చేయగా, 70.61 లక్షలు పెనాల్టీగా వసూలు చేశామని, 1,455 మందికి సంబంధించిన వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేశామని, మరో 3,378 రిజిస్ట్రేషన్ల రద్దుకు రిక్వెస్ట్ పంపామని వెల్లడించారు.
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు. అదే విధంగా ఈ సంవత్సరం డ్రంకెన్ డ్రైవ్ 49,732 కేసులు నమోదు కాగా . 10.46 కోట్ల పెనాల్టీలు కోర్టు ద్వారా వసూలయ్యాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై మొత్తం 52,803 మందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త సంవత్సరం సందర్బంగా 126 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల కేసులు 2,679 నమోదు కాగా 294 మంది మృతిచెందారని, అందులో 105 మంది పాదచారులేనని తెలిపారు.
భరోసా సెంటర్ నుంచి ఈ ఏడాది 85 అవగాహనసదస్సులు నిర్వహించామన్నారు. డ్రగ్‌ఫ్రీ సొసైటీ కోసం తెలంగాణలో లక్ష్యం పెట్టుకున్నామని, ఇందుకు తగ్గట్టుగా హైదరాబాద్ పోలీసులు నార్కోటిక్స్ ముఖ్యమైన విభాగంగా చూస్తున్నామని సజ్జనార్ చెప్పారు. డ్రగ్స్‌కు సంబంధించి గతేడాదితో పోలిస్తే కేసులు తగ్గాయని, ఈ సంవత్సరం 368 కేసులు నమోదు కాగా 2,690 మంది నిందితులను అరెస్ట్ చేశామని , ఆరున్నర కోట్లను డ్రగ్స్‌ను సీజ్ చేశామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో జోన్ల వారీగా టీమ్‌లు ఏర్పాటు చేసి డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్ నిషేధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 11 మంది విదేశీయులను వారి దేశాలకు తిరిగి పంపించామని.
రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల సమన్వయంతో రాబోయే రోజుల్లో ట్రాఫిక్‌తో పాటు నేరాల నియంత్రణ కోసం ప్రణాళిక సిద్దం చేస్తున్నామని సజ్జనార్ చెప్పారు. నేరగాళ్లు మూడు కమిషనరేట్ల పరిధిలో ఒకచోట నేరం చేసి మరోచోటకు వెళ్లడంతో సమస్యలు తలెత్తుతున్నాయని, సంఘటనలు జరిగినప్పుడు కూడా ఈ పరిస్థితి వస్తున్నదని ఆయన అన్నారు. ఇందుకోసమే ఇటీవల మూడుకమిషనరేట్ల అధికారులు పలు అంశాలపై చర్చించామని, ట్రాఫిక్ విషయంలో కూడా కొన్ని ప్రత్యేక సూచనలతో ముందుకుపోనున్నట్లు ఆయన తెలిపారు.
సంక్రాంతి పండుగ త్వరలోనే ఉన్న నేపథ్యంలో చైనా మంజా తయారీదారులు, అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రధానంగా ఇవి మంగళ్‌హాట్ ప్రాంతంలో ఉంటుందని పోలీసులు చెప్పారు. అయితే ఆపరేషన్ కవచ్‌లో భాగంగా తాము వరుసగా చేస్తున్న తనిఖీల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నామని, ఇప్పటివరకు 12 కేసులు పెట్టామని, 20మందిని అదుపులోకి తీసుకున్నామని, చైనా మంజాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సంక్రాంతిలోగానే చైనా మంజా ఎవరికీ అందుబాటులో లేకుండా చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
మరోవైపు సృష్టి ఫర్టిలిటి సెంటర్ వ్యవహారంలో సిట్ విచారణ చేసిందని, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్‌లలో ఆస్తులను అటాచ్‌మెంట్‌కు రాశామని, వాళ్ల నెట్వర్క్ పెద్దగా ఉండడం వల్ల ఇటీవల సైబరాబాద్‌లో అరస్టైన నిందితుడు కూడా ఈ వ్యవహారానికి సంబంధించిన వాడేనన్నారు. సృష్టి కేసులో చార్జ్‌షీట్ త్వరలోనే వేస్తామని పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో ఆదనపు సీపీ క్రైమ్స్ శ్రీనివాసులు, అన్ని జోన్ల డిసిపిలు, అదనపు డిసిపిలు పాల్గొన్నారు.