సిటీబ్యూరో/బంజారాహిల్స్, మే 11 (నమస్తే తెలంగాణ) : క్యూర్ పరిధిలో ప్రతిష్టాత్మకమైన గృహగణన-2027 ప్రక్రియకు సోమవారం శ్రీకారం చుట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. తొలి దశలో భాగంగా జూన్ 9వ తేదీ వరకు ‘హౌస్ లిస్టింగ్’ (ఇంటి గుర్తింపు) జరుగుతుందన్నారు. సుమారు నెల రోజుల పాటు ఈ క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగనుందని పేర్కొన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్‌తో కలిసి కర్ణన్ వివరాలను వెల్లడించారు. జనగణనకు జీహెచ్ఎంసీ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.
క్యూర్ పరిధిలోని జీహెచ్ ఎంసీతో పాటు ఎంఎంసీ, సీఎంసీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మొత్తం 19,868 హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను విభజించి, డిజిటల్‌గా మ్యాపింగ్ చేయనున్నారు. ఇందుకు 21,773 మంది ఎన్యూమరేటర్లు, 3,402 మంది సూపర్ వైజర్లను నియమించినట్లు కమిషనర్ కర్ణన్ తెలిపారు. వీరికి గత నెల 18 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు 693 బ్యాచ్‌లలో ప్రత్యేక శిక్షణ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వీరందరికీ ఐడెంటిటీ కార్డులు, ఫీల్డ్ కిట్లు, మాన్యువల్స్ పంపిణీ చేశామని చెప్పారు. నగర భవిష్యత్తు ప్రణాళికలు, ప్రభుత్వ పథకాల అమలుకు జనగణన డేటా అత్యంత కీలకమని, ఎన్యూమరేటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు సరైన వివరాలు అందించి సహకరించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రజలను కోరారు.
ఎన్యూమరేటరు ఏమి చేస్తారంటే..?
ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్ లలో ప్రతి ఇంటిని సందర్శిస్తారు. జియో-ట్యాగ్డ్ ల్యాండ్ మార్ ల ఆధారంగా సరిహద్దులను నిర్ధారిస్తారు. ప్రతి భవనానికి, ఇంటికి నిర్దేశిత క్రమంలో నంబర్లు కేటాయించి, ప్రధాన ద్వారం వద్ద గుర్తులు వేస్తారు. హెచ్ఎల్బీలోని రోడ్లు, సందులు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భవనాలతో కూడిన వివరణాత్మక ‘లేఅవుట్ మ్యాప్’ సిద్ధం చేస్తారు. చివరగా హెచ్ఎల్ఓ మొబైల్ యాప్’ ద్వారా భవన వినియోగం, వసతులు, ఇతర గృహ సంబంధిత వివరాలను డిజిటల్‌గా నమోదు చేస్తారు.
సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు విశేష స్పందన..
ఈసారి జనగణనలో ప్రవేశపెట్టిన ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ (స్వయం నమోదు) విధానానికి నగరవాసుల నుంచి మంచి స్పందన లభించింది. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు నిర్వహించిన ఈ ప్రక్రియలో సుమారు 1.27 లక్షల కుటుంబాలు ఆన్ లైన్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నాయి. దీనివల్ల ఫీల్డ్ సిబ్బందికి పనిభారం తగ్గడమే కాకుండా, ధ్రువీకరణ ప్రక్రియ సులభతరం కానుంది.
కీలక తేదీలు ఇవే.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల విధానాల రూపకల్పన కోసం పౌరులు అందరూ జనభా గణనలో వివరాలను అందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. సోమవారం ప్రారంభమైన గృహగణన కార్యక్రమం తీరును పరిశీలించేందుకు బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో ఆయన పర్యటించారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించిన కర్ణన్ పలు సూచనలు జారీ చేశారు. తప్పులు లేకుండా వివరాలు సేకరించి యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బదావత్ సంతోష్, డీఎంసీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.