సిటీబ్యూరో, నవంబర్ 3(నమస్తే తెలంగాణ) : నగరంలో పలుచోట్ల ప్రజావసరాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు కబ్జాకు గురవుతున్నాయని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 61 ఫిర్యాదులందాయని అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, మల్లాపూర్ గ్రామంలోని ఏఎంఆర్ టౌన్షిప్లో రెండు పార్కులతో పాటు రెండు రహదారులను ఆక్రమించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. సాయినగర్‌కాలనీలో నాలా పక్కన ఉన్న ప్రభుత్వభూములు కబ్జాకు గురవుతున్నాయని కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదు చేయగా, అమీర్‌పేట మండలం, సంజీవరెడ్డినగర్‌లో 1,550 గజాల స్థలం పార్కుకు కేటాయించగా కబ్జాకు గురైందని స్థానికులు చెప్పారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో పాఠశాల భవనానికి కేటాయించిన 1,967గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని వెంకటసాయికాలనీవాసులు ఫిర్యాదు చేశారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువుకు ఉన్న అలుగు ఎత్తు పెంచడమేకాకుండా అక్కడ ఉన్న నాలుగు తూములను కూడా మూసేయడంతో చెరువు విస్తీర్ణం పెరిగిందన్నారు. ఈ చెరువు నుంచి నీళ్లు బయటకుపోవడంతో కుమ్మరికుంట, బందంకొమ్ము, శంబునికుంట, ఇసుకబావి చెరువులకు నీరందక అవి కబ్జాలకు గురవుతున్నాయని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను హైడ్రా అడిషనల్ కమిషనర్ అశోక్‌కుమార్ పరిశీలించి.. వాటిపరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.