బంజారాహిల్స్, జూలై 15: ప్రజల భాగస్వామ్యంతో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలకు పాల్పడిన నిందితులను నిమిషాల వ్యవధిలోనే గుర్తించగలుగుతున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వాక్‌వేలో రూ. 80లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 152 సీసీ కెమెరాలను, జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని పలు ప్రధాన రహదారుల్లో రూ. 60లక్షల వ్యయంతో కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 112 సీసీ కెమెరాలను కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అనేక సౌకర్యాలు కల్పించారన్నారు. అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలతో పాటు పోలీస్స్టేషన్ల నిర్మాణంతో పోలీసుశాఖ రూపురేఖలు మారాయన్నారు. ఇదే క్రమంలో నేరాల అదుపు కోసం తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పౌరుల భాగస్వామ్యంతో చేపట్టిన కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్ట్, నేను సైతం కార్యక్రమం, సేఫ్‌సిటీ ప్రాజెక్టు తదితర కార్యక్రమాలతో పాటు మెట్రోరైల్ కెమెరాలు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కెమెరాలతో సహా హైదరాబాద్ నగరంలో లక్షలాది కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలోని మొత్తం సీసీ కెమెరాల్లో 62శాతం సీసీ కెమెరాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని, దేశంలోనే అత్యధిక నిఘా కెమెరాలు కలిగి ఉన్న నగరంగా హైదరాబాద్ గుర్తింపు సాధించిందన్నారు. ఇంత భారీ ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నగరంలో ఏ నేరం జరిగినా నిమిషాల వ్యవధిలోనే నేరస్తులను గుర్తించగలుగుతున్నామన్నారు. నగరంలో నేరం చేస్తే తప్పించుకోవడం అసాధ్యం అనే విధంగా సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ తదితర టెక్నాలజీలను వినియోగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ గజరాజ్ భూపాల్, వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్, అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్దిఖీ, బంజారాహిల్స్ ఏసీపీ శ్రీధర్, జూబ్లీహిల్స్ ఎస్‌హెచ్‌వో రాజశేఖర్‌రెడ్డి, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.