మేడ్చల్, ఆగస్టు 16 : కుక్కకాటుకు సత్వరమే వైద్యం అందించాలని మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన మేడ్చల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అన్ని విభాగాలను తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు. కుక్కలు, కోతుల బారి నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
కుక్కకాటుకు గురైన వారు ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ తదితర జ్వరాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సీహెచ్సీ సందర్శనలో భాగంగా పరీక్షా కేంద్రం, ఆయుష్ విభాగం, ఫార్మసీ, ల్యాబ్, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు.