సిటీ బ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో భద్రత లేని బస్సులపై నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ హరిచందన దాసరి అధికారులకు సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యం, సంబంధిత శాఖలు నిర్వహించే బాధ్యతపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులపై శ్రద్ధ చూపాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దీన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. నేటి పిల్లలే రేపటి భవిష్యత్తుకు పునాదులని, పాఠశాల నిర్వాహకులు ఫిట్నెస్ ఉన్న వాహనాలను మాత్రమే నడపాలని, డ్రైవర్లకు రోడ్డు నిబంధనలు తప్పక తెలిసి ఉండాలని సూచించారు.
ప్రతి బస్సులో అటెండెంట్ తో పాటు పాఠశాలలో సెక్యూరిటీ గార్డులు ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 9,10వ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యజమాన్యం ప్రత్యేక బాధ్యత, శ్రద్ధ చూపాలని అన్నారు. పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని, ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ హైదరాబాద్ జిల్లాలో పటిష్ట చర్యలు చేపట్టిందని వెల్లడించారు. బస్సులపై పాఠశాల, కళాశాల నిర్వాహకుల ఫోన్ నెంబర్లు తప్పక ఉండాలని, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ మీద పేరు తప్పకుండా రాయాలన్నారు.
రవాణా, విద్యాశాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ప్రమాదాలకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తప్పనిసరిగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేశ్, స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, ఆర్టీసీ ఈడీ రాజశేఖర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, డీఈవో రోహిణి, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ జోయెల్ డేవీస్, కంటోన్మెంట్ బోర్డ్ సీఈఓ మధుకర్ నాయక్ పాల్గొన్నారు.