మేడ్చల్, మార్చి 1 : జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 6536 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నిర్ణయించిందన్నారు. అవసరమైన బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలన్నారు. ఎన్నికల అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో లింగ్యానాయక్, ఎన్నికల అధికారులు పాపిరెడ్డి, రంగాచారి పాల్గొన్నారు.