సిటీబ్యూరో, ఆగస్టు 15 ( నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జాతీయ జెండా ఆవిష్కరించి జిల్లా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. హైదరాబాద్‌లో 691 ప్రభుత్వ , 253 ఎయిడెడ్ పాఠశాలల్లో మొత్తం 88,547 విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామన్నారు.
అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో 60 వేల విద్యార్థులకు మధ్యా హ్న భోజనం పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమంలో భాగంగా 384 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల హాజరుశాతం పెంపొందించేందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులతో ‘కాఫీ విత్ కలెక్టర్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. జిల్లాలో 2,71,963 మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నామని, అందుకోసం నెల కు రూ.61 కోట్లకు పైగా కేటాయిస్తున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద 1703 మందికి రూ.17కోట్లకుపైగా అందించామన్నారు.
షాదీ ముబారక్‌లో 5494 మందికి రూ.55 కోట్లు అందజేసిన ట్లు పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 91 యూపీహెచ్సీఎస్, 169 బస్తీ దవాఖానాలు ఉన్నాయన్నారు. 28 మంది ఆర్బీఎస్కే బృందాల ద్వారా 2.27 లక్షల వైద్య పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల పెంపు అనంతరం 32,370 మందికి రూ.79.52 కోట్లు వైద్య చికిత్సలకు చెల్లించినట్టు వివరించారు.