సిటీ బ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయులు విద్యార్థుల పఠన, గ్రహణశక్తి పై దృష్టి సారించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం డిప్యూటీఈఓ, డిప్యూటీ ఐఓఎస్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, ఎంఎన్ఓ లు, ఈఈ, ఏఈఈ లతో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, ఎఫ్ఎల్ఎన్, ఎస్ ఎస్ సీ ఫలితాలు, యూడీఐఎస్ఈ కార్యక్రమాలపై మండలాల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను యుద్ధ ప్రాతిపదికన 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. డిప్యూటీ ఐఓఎస్ లు తమ పరిధిలోని పాఠశాలల్లో 100 శాతం ఎఫ్ ఎల్ఎన్ సందర్శన చేయాలని సూచించారు. విద్యా సంవత్సరంలో ఇంకా 50 రోజులే మిగిలి ఉన్నందున తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. డిప్యూటీ ఈవోలు తమ పరిధిలో మెరుగైన ఫలితాలను సాధించడంలో ఉత్తమ పద్ధతులను అవలంబించాలని చెప్పారు. రెగ్యులర్ సందర్శనలో భాగంగా పఠన గ్రహాణానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్ఎస్సీలో గత సంవత్సరం 86.8 శాతం ఫలితాలు వచ్చాయని ఈ సంవత్సరం కనీసం 90 శాతం హైదరాబాద్ జిల్లా సాధించాలన్నారు.