సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో చలిగాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలిపులి నగర జనాన్ని వణికిస్తోంది.
ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం నుంచి నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3 డిగ్రీలు తగ్గి, 15.5 డిగ్రీల సెల్సియస్గాను, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6డిగ్రీలు, గాలిలో తేమ 46 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల మరో రెండు మూడు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 11నుంచి 12డిగ్రీలకు పడిపోయే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు హెచ్చరించారు.