జీహెచ్ఎంసీ వర్సెస్ హైడ్రాల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నది.. విజిలెన్స్ విభాగం తరహాలోనే ఫైర్ డిపార్ట్మెంట్ను తమ ఆధీనంలోకి తీసుకున్న హైడ్రా ..జీహెచ్ఎంసీ అధికారాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. ఫలితంగా నిర్మాణ రంగ అనుమతుల జారీలో కీలకమైన ఫైర్ ఎన్వోసీల జారీలో అంతా గందరగోళం నెలకొంది..
నిర్మాణ రంగ అనుమతులు ఒకే గొడుగు కింద నుంచి వెళ్లాలి..కానీ జీహెచ్ఎంసీలో చలాన్లు కట్టిన దరఖాస్తులకు హైడ్రా కేంద్రంగా తనిఖీలు జరిపి సంబంధిత నిర్మాణానికి అనుమతులు మంజూరవుతున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల అంతర్గత కోల్డ్‌వార్ కొనసాగుతుండగా…ఫైర్ ఎన్వోసీల పొందాలనుకునే వారికి రెండు శాఖల చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదు.
-సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ)
హైడ్రా ఏర్పాటు కంటే ముందు జీహెచ్ఎంసీ ఆధీనంలో ఈవీడీఎం విభాగం ఉంది. ఈవీడీఎం డైరెక్టర్ కింద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు అడ్వర్టయిజ్మెంట్ విభాగాలు ఉన్నాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం డిజాస్టర్ మేనేజ్మెంట్ తప్ప..మిగతా విభాగాలన్నీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధీనంలోనే పనిచేయాలి.
కానీ హైడ్రా కమిషనర్ దూకుడుగా వ్యవహరించి జీహెచ్ఎంసీ అధికారాలను తమ గుప్పిట్లోనే పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారులు, ఉద్యోగులే నిదర్శనం. విజిలెన్స్‌కు సంబంధించిన కానిస్టేబుళ్లు, ఎస్ఐ, సీఐ, ఏసీపీలు బల్దియాలోకి రిపోర్టు చేయాలి. కానీ దాదాపు నెల రోజులు దాటినా.. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌కు విజిలెన్స్ టీం రిపోర్టు చేయలేదు. జీహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్ అధికారులు హైడ్రా కమిషనర్ ఆఫీసులోనే ఉద్యోగాలు చేస్తూ వచ్చారు.
వీరు జీతం మాత్రం బల్దియాలోనే తీసుకుంటూ హైడ్రా కార్యాలయంలో ఎలా పనిచేస్తారంటూ అప్పటి కమిషనర్ ఆమ్రపాలి మందలించారు. ఆమె మందలింపుతో వెంటనే విజిలెన్స్ టీం జీహెచ్ఎంసీలో రిపోర్టు చేసి ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈ తరహాలోనే ఇప్పుడు ఫైర్ విభాగం సిబ్బంది కూడా జీహెచ్ఎంసీలోనే పనిచేయాల్సి ఉంది. ఎందుకంటే నిర్మాణ రంగ అనుమతుల జారీ ఒకే కేంద్రంగా కొనసాగాలి..కానీ డిజాస్టర్ పేరిట హైడ్రాలోనే ఫైర్ విభాగం అధికారులు (ఎస్ఎఫ్ఓలు ఐదుగురు, డీఎఫ్ఓలు రెండు, ఆర్ఎఫ్ఓలు రెండు)పనిచేస్తున్నారు.
వాస్తవంగా 15 మీటర్ల లోపు నిర్మాణ రంగ అనుమతుల ప్రక్రియలో భాగంగా జీహెచ్ఎంసీలో ఫైర్ ఎన్వోసీకి సంబంధించి చలాన్ (క్యాష్) చెల్లించిన నిర్మాణదారులకు ఒకే గొడుగు కింద సేవలు అందాలి. కానీ జీహెచ్ఎంసీలో చలాన్ కడితే జారీ మాత్రం హైడ్రా కేంద్రంగా ఉన్న ఫైర్ విభాగం అధికారుల పరిశీలన అనంతరం ప్రొవిజినల్ సర్టిఫికెట్ (ఫైర్ ఎన్వోసీ సర్టిఫికెట్) తీసుకోవాల్సి వస్తున్నది.
దీంతో రెండు శాఖల చుట్టూ నిర్మాణదారుడికి ప్రదక్షిణలు తప్పడం లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధీనంలోనే ఫైర్ డిపార్ట్మెంట్ విభాగం పనిచేస్తే ఈ జాప్యం తగ్గి నిర్మాణదారులకు సులువుగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కమిషనర్ దృష్టి సారించి విజిలెన్స్ విభాగం తరహాలోనే ప్రత్యేకంగా ఫైర్ సిబ్బందిని జీహెచ్ఎంసీకి తీసుకువచ్చి ఒకే గొడుగు కింద సేవలు పొందేలా చొరవ తీసుకోవాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.