సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): చలికాలంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంతో పాటు గ్రేటర్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోవడంతో పాటు దట్టమైన పొగ మంచు అలుముకుంటోంది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము సమయంలో దట్టంగా కమ్ముకుంటున్న పొగ మంచు వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడం, ముందు ఉన్న వాహనాలు కనిపించకపోవడంతో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు, ప్రయాణికులు సాధ్యమైనంత వరకు రాత్రి, తెల్లవారుజాము ప్రయాణాలను మానుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
అంతే కాకుండా పాదాచారులు, ద్విచక్రవాహనదారులు సైతం అప్రమత్తంగా ఉండాలని, భారీ వాహనదారులకు పొగమంచు కారణంగా రోడ్లపై వెళ్లే పాదచారులు, ద్విచక్రవాహనాలు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు, ప్రయాణికులు ముఖ్యంగా ఓఆర్ఆర్, జాతీయ, రాష్ట్రీయ, హైవేలు, ప్రధాన రహదారులపై తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.