ముషీరాబాద్ : నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth reddy) వెంటనే స్పందించి చర్చలు జరపాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (R Krishnaiah) డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పోరాటాన్ని రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తూ ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
శనివారం విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల(Un employees) డిమాండ్లపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకురావాలని, నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్లు న్యాయమైనవి కాకపోతే వేలాది మంది ఎలా వస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం రెండు లక్షల ఉద్యోగాల భర్తికి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1,2,3,4, టీచర్ పోస్టుల(Teacher post) ను పెంచాలని, అన్ని శాఖలలో ఖాళీలను గుర్తించి ఆ మేరకు పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరారు.
గ్రూప్-1, 2,3, 4 పోస్టులు 25 వేల వరకు ఖాళీలు ఉంటే కేవలం11 వేల పోస్టులను భర్తీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కొందరు ఉన్నతాధికారులు డైరెక్టు రిక్రూట్మెంట్ పోస్టులు లెక్కించడంలో అన్యాయంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సరైన విధంగా ఖాళీలను గణనచేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపకుండా చోద్యం చేస్తున్నారని మండిపడ్డారు.
కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తించి, రెవెన్యూ, తాలూకా, మున్సిపల్ కార్పొరేషన్లు, కమిషనరేట్లు, మున్సిపాలిటిలు, గ్రామపంచాయితీలలో అవసరమైన మేర కొత్త పోస్టులను భర్తీ చేయాలని, పాలనను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేశ్, అంజి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.