సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో భూముల లెక్కలు తేల్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం హెచ్ఎండీఏ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే ప్రణాళికా విభాగం, ఇంజినీరింగ్, ల్యాండ్‌పూలింగ్ విభాగాలపై పలుమార్లు మెట్రోపాలిటన్ కమిషనర్ నేతృత్వంలో సమీక్షలు నిర్వహించారు. ఇటీవల ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మొత్తం భూముల వివరాలు కావాలని కోరారు.
దీంతో మెట్రోపాలిటన్ కమిషనర్ దాన కిశోర్ హెచ్ఎండీఏ ఎస్టేట్ విభాగం ఉన్నతాధికారులకు భూముల లెక్కలతో సమీక్షకు రావాలని ఆదేశించారు. ఈ మేరకు ఎస్టేట్ విభాగంలోని ఉన్నతాధికారులు, ఉద్యోగులంతా ఆదివారం కూడా అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చి భూముల వివరాలపై నివేదికను సిద్ధం చేసుకున్నారు. సోమవారం మెట్రోపాలిటన్ కమిషనర్ ఎస్టేట్ ఆఫీసర్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టి మెహమ్మద్ అసదుల్లాతో పాటు ఇతర అధికారులతో హెచ్ఎండీఏకు చెందిన భూములపై ప్రధానంగా చర్చించారు.
ప్రధానంగా నగర శివారులోని జవహర్‌నగర్‌లో హెచ్ఎండీఏకు 3వేల ఎకరాల వరకు ఉండగా, అందులో చాలా పెద్ద మొత్తంలో కబ్జాలు కాగా మిగిలిన భూముల పరిస్థితిపై చర్చించారు. అదేవిధంగా శంషాబాద్, మియాపూర్, బుద్వేల్, కోకాపేట, వట్టినాగులపల్లి, ఉప్పల్ భగాయత్ ప్రాంతాల్లో మొత్తం ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, వాటిపై ఉన్న కేసులు వివరాలను అడిగారు. దీనికి ఎస్టేట్ విభాగం ఉన్నతాధికారులు మొత్తం భూముల వివరాలపై నివేదికను రూపొందించి ఇస్తామని మెట్రోపాలిటన్ కమిషనర్‌కు తెలిపారు.