Revanth Reddy | మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతిపై పూర్తి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల ప్రస్తుత పరిస్థితిని సీఎంకు అధికారులు వివరించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం నగరంలో శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, చికున్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీఎం రోడ్డుపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వానాకాలంలో డ్రైనేజ్ ఓవర్ ఫ్లో ఉండకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా చూడటంతో పాటు, దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సీం సూచించారు. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలతో రావాలని.. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కోర్ అర్బన్ రీజియన్‌కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్ర పాలసీ తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఎఫ్‌సీడీఏ కమిషనర్ కే శశాంక, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీ అశోక్ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.