హైదరాబాద్ : శతాబ్దాలుగా హైదరాబాద్ నగరం ‘గంగా-జమునా తెహజీబ్’గా పిలువబడుతూ బహుళ జాతులు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో విలసిల్లుతూ సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అన్నారు. ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ పునరుద్ధరణ ప్రాజెక్ట్(Qutub Shahi Heritage Park) ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వేల సంవత్సరాల నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణ శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు పాలించారు.
ప్రతి ఒక్కరు వారి ప్రత్యేకమైన సాంస్కృతిక ముద్రను వేశారన్నారు. చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్షాషీ సమాధులు, పైగా సమాధులు, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయాలు వంటివి వాస్తు అద్భుతాలకు నిదర్శమన్నారు. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్, సెవెన్ టూంబ్స్ కుతుబ్ షాహీల రాజవంశం నిర్మాణ నైపుణ్యానికి, సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంస్కృతి, వారసత్వ కట్టడాలను కాపాడటంతో పాటు వాటి విశిష్టతను ప్రపంచ పటంలో సగర్వంగా ఉంచేలా పని చేస్తుందని పేర్కొన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప దేవాలయం తెలంగాణకే గర్వకారణమన్నారు.