గోల్నాక (హైదరాబాద్) : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) ఆరోపించారు. గోల్నాక డివిజన్ మూసీ పరివాహక (Musi catchment area) ప్రాంతం తులసీరాంనగర్ లంక ప్రాంతానికి వెళ్లి నివాసులతో మాట్లాడారు.
అంబర్పేట మూసీ పరివాహక ప్రాంతాల నివాసితులు తమ ఇండ్లను హైడ్రా కూల్చుతారని భయాందోళనకు గురి కావొద్దొని సూచించారు. బుల్డోజర్ కన్నా ముందే తానుంటానని భరోసా కల్పించారు. హైడ్రా(HYDRA) బాధితులకు బీఆర్ఎస్ (BRS) అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు. నగరంలో హైడ్రా తమ ఇండ్లను కూల్చుతుందేమోనన్న భయంతో కొందరు గుండె పోటుకు గురై దవాఖానాల్లో చికిత్స పొందుతుండగా మరి కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలు నిర్మించుకున్న ఇండ్లకు ప్రస్తత మార్కెట్ విలువకు రెండింతలు చెల్లించడంతో పాటు వారితో సవివరంగా అధికారులు చర్చించి వారి ఆమోదం తర్వాతే ఇండ్ల జోలికి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఏ విధమైన కార్యాచరణ లేకుండా పేదల ఇండ్లకు మార్కింగ్ వేసి తొంతర పాటు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.