Osmania Hospital | అబిడ్స్, సుల్తాన్‌బజార్, జనవరి31 : గోషామహల్ స్థానిక ప్రజల నిరసనలు, వివిధ పార్టీల నాయకుల ముందస్తు అరెస్టులతో పోలీసుల అష్టదిగ్బంధనం మధ్య ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. గోషామహల్ పోలీస్ స్టేడియం ఆవరణలో ఉస్మానియా దవాఖాన నూతన భవనాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలసిందే. ఈ నిర్ణయాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గోషామహల్ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటు ప్రతి నిత్యం నిరసన కార్యక్రమాలను చేపట్టారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉస్మానియా దవాఖానాను ఇక్కడే నిర్మిస్తామని ప్రకటించి శంకుస్థాపన చేసింది. ఈ శంకుస్థాపనను అడ్డుకునేందుకు గోషామహల్ పరిరక్షణ సమితితో పాటు వివిధ పార్టీల నాయకులు శతవిధాల ప్రయత్నం చేసినా పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసి వెళ్లిపోయారు.
ముందస్తులు అరెస్టులు
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి శంకుస్థాపన సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్, ఆశిష్ కుమార్ యాదవ్, సురేష్ ముదిరాజ్‌లతో పాటు పలువురు బీజేపీ నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదిలా ఉండగా షాహినాయత్ గంజ్, మంగళ్‌హాట్, బేగంబజార్, సుల్తాన్‌బజార్, అఫ్జల్‌గంజ్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వివిధ పార్టీల నాయకులను ముందస్తు అరెస్టు చేసి సాయంత్రం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆనంద్‌కుమార్ గౌడ్, ఆశిష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అక్రమంగా అరెస్టులు చేసి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నూతన భవనాన్ని నిర్మిస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురు అరెస్టు
గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్పొరేటర్ లాల్ సింగ్, బీజేవైఎం నాయకులు రాము, గోషామహల్ పరిరక్షణ సమితి అధ్యక్షులు వినోద్ యాదవ్, తెలుగు దేశం పార్టీ నాయకులు కేడీ దినేశ్, బీఆర్ఎస్ నాయకులు దత్తు, అశోక్ ముదిరాజ్ తదితరులు పోలీస్ స్టేడియం ముందు నిరసనకు దిగారు.