రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ శాస్త్రీయంగా జరగాలంటే రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాల్సిందేనని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. ఇదే సరైన విధానమైతే.. హైదరాబాద్ మహా నగరాన్ని ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరిస్తూ చేపట్టిన మున్సిపల్, పోలీసు శాఖల పునర్విభజన ప్రక్రియలో కమిటీ ఎందుకు వేయలేదు? కనీసం క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలైనా ఎందుకు తీసుకోలేదు? చివరకు నగర ప్రజాప్రతినిధుల మనోగతాన్ని సైతం ఎందుకు పట్టించుకోలేదు? నాలుగు గోడల మధ్య కంప్యూటర్ తెరపై గుగూల్ ముందు పెట్టుకొని అడ్డం.. పొడవు.. అర్థంలేని విభజనతో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు? అసలు జనాభాపరంగా ప్రక్రియ చేపట్టారా? భౌగోళిక విస్తీర్ణపరంగా చేపట్టారా? అనేందుకు నేటికీ అధికారుల నుంచి శాస్త్రీయమైన సమాధానం ఎందుకు రావడం లేదు. ఇప్పుడు హైదరాబాద్ మహా నగరవాసుల్లో ఇదే సందేహం వ్యక్తమవుతున్నది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 12 (నమస్తే తెలంగాణ): నాడు ఉమ్మడి రాష్ట్రమైనా… ఇప్పటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైనా.. రాష్ర్టానికి ఆర్థిక ఇంజిన్‌లా ఉండే హైదరాబాద్ మహా నగర విస్తరణలో శాస్త్రీయతకు చోటు కల్పించని కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో శాస్త్రీయత అంటూ కొత్త రాగాన్ని అందుకుంది. జీహెచ్ఎంసీని విస్తరించి 150 నుంచి 300 వార్డులుగా పునర్విభజన చేసి నెల రోజులైనప్పటికీ ఇప్పటిదాకా డివిజన్ల విభజన మ్యాపులను ప్రజలకు అందుబాటులో ఉంచని ప్రభుత్వం శాస్త్రీయత అనే పదాన్ని వినియోగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉండి.. మినీ భారతంలా విలాసిల్లుతున్న మహా నగర.. భౌగోళిక, పాలనాపరమైన హద్దులు మార్చే క్రమంలో కనీస జాగ్రత్త, ముందుచూపు చర్యలు తీసుకోకపోవడంతో పునర్విభజన ప్రక్రియ నిరసన మంటల్ని రేపింది. మహా నగరంలో అనేకచోట్ల ఇదెక్కడి అడ్డగోలు విభజన? అంటూ కాంగ్రెస్ సహా అఖిలపక్షం నాయకులతో పాటు సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.
అశాస్త్రీయమైనదని అంగీకరించినట్లే..
ప్రభుత్వం పాలనాపరమైన కీలక ప్రక్రియల్ని చేపడుతున్నపుడు అన్నింటికీ ఒకే విధానం ఉండాలి. కానీ ఒక ప్రక్రియను నాలుగు గోడల మధ్య ముగించి… మరో ప్రక్రియను చేపట్టేందుకు మాత్రం శాస్త్రీయంగా ఉండేందుకు జుడీషియల్ కమిటీని వేస్తామనడమంటేనే మొదటిది అశాస్త్రీయమైనదని అంగీకరించినట్లే. హైదరాబాద్ మహా నగరంలో మున్సిపల్, పోలీసు శాఖల పరిధుల్లోని వార్డులు, కమిషనరేట్ల పునర్విభజన ప్రక్రియలో కచ్చితంగా ఓ కమిటీని వేసి… విస్తృత అభిప్రాయాల్ని తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదనే వాదన వినిపిస్తున్నది. ఎందుకంటే.. ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఇలా నాలుగు రెవెన్యూ జిల్లాలు ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ చెబుతున్నట్లు జిల్లాల పునర్విభజనలో జుడీషియల్ కమిటీ వేసి తుది నిర్ణయం తీసుకుంటామంటే ఆ ప్రక్రియలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఏర్పాటు కూడా పరిశీలనలోనికి వస్తుంది. అంటే రెవెన్యూ జిల్లాల ఏర్పాటుపై జుడీషియల్ కమిటీని వేసిన ప్రభుత్వం వీటి పరిధిలోని డివిజన్లు, పోలీసు కమిషనరేట్ల పునర్విభజనలో మాత్రం ఆ విధానాన్ని ఎందుకు పాటించడంలేదనే దానిపై భారీ ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేస్తానని ముఖ్యమంత్రి గత ప్రకటనతో పాటు పాలనా-ప్రజల సౌలభ్యమే లక్ష్యంగా కాకుండా రాజకీయ కోణంలోనే ఈ అడ్డగోలు విభజన చేశారనే ఆరోపణలకు ఇది బలాన్ని చేకూరుస్తున్నది. చివరకు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సైతం వార్డుల పునర్విభజన ప్రక్రియపై అసెంబ్లీ వేదికగానే పెద్ద ఎత్తున నిరసన, అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
సికింద్రాబాద్ కనుమరుగు
నాలుగు శతాబ్దాల హైదరాబాద్ నగరం.. ఆ తర్వాత సికింద్రాబాద్ వంటి మున్సిపల్ కార్పొరేషన్ విలీనం.. తద్వారా జంట నగరాలుగా చరిత్రలో హైదరాబాద్-సికింద్రాబాద్ స్థిరపడ్డాయి. ఈ నేపథ్యంలో గత ఉమ్మడి ప్రభుత్వాలతో పాటు కేసీఆర్ ప్రభుత్వం కూడా వాటి ప్రాశస్త్యానికి ఆటంకం కలగకుండా విస్తరణ ప్రక్రియలు చేపట్టాయి. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల భౌగోళిక ఉనికి మీదనే దెబ్బ కొడుతున్నది. అందుకే సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్‌పై ప్రజా ఉద్యమం మొదలైంది. ప్రజల్లో ఆ ఆవేదన ఉండటంతోనే బీఆర్ఎస్ సైతం ప్రజల గొంతుకగా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ప్రకటించిన ఊహానగరి… ఫోర్త్ సిటీపై ధ్యాసతో మిగిలిన మహా నగరాన్ని ఛిన్నాభిన్నం చేస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏ ప్రాంతమైనా దానంతట అది విస్తరించి.. ఒక నగరంగా రూపుదిద్దుకుటుందే గానీ పాలకులు, ప్రభుత్వాలు ప్రజలపై రుద్దితే నగరం ఆవిర్భవించదని నిపుణులు చెబుతున్నారు.
ఏ ప్రాతిపదికన 300 డివిజన్లు చేశారు..?
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 డివిజన్లను 300 డివిజన్లుగా పునర్విభజన చేపట్టిన సమయంలో అసలు ఏ అంశాన్ని, సాంకేతిక వివరాల్ని ప్రాతిపదికగా తీసుకున్నారనేది కనీసం అధికారులు సైతం చెప్పలేకపోతున్నారు. తొలుత జనాభా అన్నారు… ఆపై ఓటర్లు అన్నారు. విలీనమైన ప్రాంతాల్లో భౌగోళిక విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున భవిష్యత్తులో ఓటర్లు పెరుగుతారని చెప్పారు. కానీ కించిత్తు విస్తరణకు అవకాశంలేని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లాంటి డివిజన్‌ను 16వేల మంది ఓటర్లతో ఎలా ఏర్పాటు చేస్తారనే సూటి ప్రశ్నకు ఇప్పటిదాకా అధికారులు, ప్రభుత్వం సమాధానాన్ని చెప్పలేకపోయిందంటేనే ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందనేందుకు ఉదాహరణ.
దీంతో పాటు తాము సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెర్స్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నా.. డివిజన్ల సరిహద్దుల ప్రక్రియను కేవలం టౌన్‌ప్లానింగ్ అధికారులతో గూగుల్ మ్యాపుల ద్వారా చేయించారనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంతటి కీలకమైన ప్రక్రియను చేపట్టే ముందు కమిటీ వేయడంగానీ, ప్రజల అభిప్రాయాల్ని విస్తృతంగా సేకరించడంగానీ చేయకపోవడమంటే ప్రభుత్వ పెద్దలు ఎలా అనుకున్నారో అదేరీతిన చేసి ప్రజలపై రుద్దుతున్నారనే ఆగ్రహం ప్రజల్లో ఉంది. చివరకు పోలీసు శాఖ కమిషనరేట్ల పునర్విభజనను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా చేపట్టింది. ఉదాహరణకు… సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఉన్న చేవెళ్ల, శంకరపల్లి ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లో కలిపారు.
ఈ నేపథ్యంలో శంకర్పల్లి నుంచి ఒక సామాన్యుడు కమిషనరేట్‌కు రావాలంటే 66 కిలోమీటర్లు.. అంటే ఉదయం బయలుదేరితే సాయంత్రానికి కానీ కమిషనరేట్‌కు రాలేని పరిస్థితి. ఫ్యూచర్ సిటీని ఆనుకొని ఉన్న శంషాబాద్, ఆదిబట్ల, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కలిపారు. దీంతో అసలు ఈ పునర్విభజనకు ప్రాతిపదిక ఏందో.. అని చివరకు పోలీసు అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. కాగా ఈ ప్రక్రియలో చారిత్రక హైదరాబాద్ భౌగోళికంగా పెద్ద ఎత్తున దెబ్బతింటున్నది. బేగంపేట వంటి ప్రాంతాలతో పాటు చారిత్రక కంటోన్మెంట్ నియోజకవర్గం దాదాపుగా హైదరాబాద్ నుంచి విడిపోయి మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌లో కలుస్తున్నది. ఇక హైదరాబాద్ అంటే పాత నగరం వరకు పరిమితమైన ప్రాంతాన్ని ఏకంగా శంషాబాద్ వరకు పొడగించడమేందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రభుత్వ పెద్దలు కేవలం ఫ్యూచర్ సిటీకి కాగితాలపై ఒక రూపు తెచ్చేందుకు తమకు నచ్చిన ప్రాంతాలను అందులో కలిపి మిగిలిన ప్రాంతాలను ఛిన్నాభిన్నం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.