CM Revanth Reddy | కాచిగూడ, ఏప్రిల్ 6: ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, తదితర కోర్సులు చదువుతున్న 14 లక్షల 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నాడని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే HCU లోని 400 ఎకరాల వేలం పాట ప్రక్రియ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నాడు బర్కత్పురా ఎక్స్ రోడ్డులో విద్యార్థి సంఘాలతో కలిసి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వకుండా.. అందాల పోటీలకు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం హెచ్సీయూ విద్యార్థులపై ఎత్తిన ప్రతి లాఠీ దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. హెచ్సీయూ 400 ఎకరాల భూముల వేలం పాటను వెనక్కు తీసుకుని, తక్షణమే హెచ్సీయూకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో విఫలమైనాడని, విద్య పట్ల కనీస అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన గుప్పెట్లో పెట్టుకొని విద్యావ్యవస్థనే భ్రష్టు పట్టించాడని ధ్వజమెత్తారు.