మూసీ సుందరీకరణ ఫేజ్-1 గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శనివారం సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా పోలీసులు అడుగడుగునా.. ఆంక్షలు విధించారు. గ్రామస్తులకు అనుమతి నిరాకరించారు. దీంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. ‘మా ప్రమేయం.. భాగస్వామ్యం లేకుండా ఇష్టానుసారంగా ఆలయం కట్టేందుకు శంకుస్థాపన ఎలా చేస్తారం’టూ.. నిలదీశారు. భూములను దోచుకునేందుకే తమకు సమాచారం ఇవ్వకుండా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారంటూ..మండిపడ్డారు. ‘మా గ్రామంలో మా అనుమతి లేకుండా గుడి కట్టేందుకు మీరెవరు.. అంటూ.. ఎంఆర్డీసీఎల్ చైర్మన్ నరసింహారెడ్డితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే కారణంలో పోలీసులు పరీవాహక ప్రాంతంలోని కొందరు కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. హిమయాత్ సాగర్ మాజీ సర్పంచ్ ఆంజనేయులు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దర్గా ఖలీజ్‌ఖాన్ మాజీ కార్పొరేటర్ అస్లాంబిన్ అబ్దుల్లా, మాజీ కార్పొరేటర్ ముద్దం రాములను హౌస్ అరెస్ట్ చేశారు. మూసీ పునరుజ్జీవం పేరిట భూములను లాక్కోవద్దని సొంత పార్టీ నేతలే వ్యతిరేకించడం సర్కార్‌కు మింగుడుపడని అంశంగా మారింది. ‘మూసీ పునరుజ్జీవ’ పనులు ప్రారంభిస్తేనే సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారని అరెస్టులు చేస్తే.. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఎంతమందిని అరెస్టు చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సిటీబ్యూరో/మణికొండ/ బండ్లగూడ : మూసీ సుందరీకరణ ఫేజ్-1 గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు శనివారం మంచిరేవులలో మూసీ రివర్ఫ్రండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.700 కోట్లతో 8 ఎకరాల విస్తీర్ణంలో ఓంకారేశ్వరస్వామి దేవాలయ నిర్మాణం, వీరభద్రస్వామి, మచిలేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. కాగా, తమ ప్రమేయం లేకుండా.. తమను భాగస్వామ్యం చేయకుండా ఇష్టానుసారంగా ఆలయం కట్టేందుకు శంకుస్థాపన ఎలా చేస్తారని ఎంఆర్డీసీఎల్ చైర్మన్ నరసింహారెడ్డిని మంచిరేవుల గ్రామస్తులు నిలదీశారు.
శంకుస్థాపన కార్యక్రమానికి తమను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. తమ గ్రామంలోని భూముల్లో తమ అనుమతి లేకుండా గుడిని ఎలా కడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాన్ని నిర్మించాలనుకున్నప్పుడు గ్రామ ప్రజలను భాగస్వామ్యం చేయకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని మండిపడ్డారు. ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేస్తున్నట్లు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. విలువైన ఆలయ భూములను దోచుకునేందుకే తమకు సమాచారం ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు. ముందస్తు ఏర్పాట్లు లేకుండా రెండు రోజుల్లోనే ఆగమేఘాల మీద శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.

‘మా గ్రామంలో మా అనుమతి లేకుండా గుడి కట్టేందుకు మీరెవర’ని నరసింహారెడ్డిపై మండిపడ్డారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. మరోవైపు మూసీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే కారణంలో పోలీసులు పరీవాహక ప్రాంతంలోని కొంతమంది కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. అందులో భాగంగానే హిమయాత్ సాగర్ మాజీ సర్పంచ్ ఆంజనేయులు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దర్గా ఖలీజ్‌ఖాన్ మాజీ కార్పొరేటర్ అస్లాంబిన్ అబ్దుల్లా, మాజీ కార్పొరేటర్ ముద్దం రాములను హౌజ్ అరెస్ట్ చేశారు. మూసీ పునరుజ్జీవనం పేరిట భూములను లాక్కోవద్దని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తుండటంతో కాంగ్రెస్ సర్కారు తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. దీంతో హిమాయత్‌సాగర్, దర్గా ఖలీజ్‌ఖాన్ ప్రాంతానికి చెందిన నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
మూసీ పునరుజ్జీవ కార్యక్రమం పనులు ప్రారంభిస్తేనే సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారని అరెస్టులు చేస్తే.. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఎంతమందిని అరెస్టు చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూములను లాక్కోవడం ఇండ్లను కూల్చేయడం చేస్తే ప్రజాగ్రహం ఎంత మేర ఉంటుందో ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే గమనించినట్లు పరీవాహక ప్రజలు చర్చించుకుంటున్నారు. శంకుస్థాపనకే కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తుండటం చూస్తూ భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారనేది బట్టబయటలైందని చెప్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొంతమంది బీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళనలు, నిరసనల్లోనూ పాల్గొంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ప్రొటోకాల్ పాటించరా?
ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్

ఓంకారేశ్వరస్వామి ఆలయ శంకుస్థాపన సభలో ప్రొటోకాల్ పాటించకుండా తనను అవమానించారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభ ముగిసిన వెంటనే ఎంఆర్డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డిపై విరుచుకుపడ్డారు. కార్పొరేషన్ చైర్మన్ అయిన తనను స్టేజీపైకి పిలువకుండా అవమాన పరుస్తారా? అంటూ నిలాదీశారు. మిగతా సామాజిక వర్గానికి చెందిన కార్పొరేషన్ చైర్మన్లను స్టేజీపై కూర్చొబెట్టి తనను ఎందుకు వేదికపైకి పిలువలేదని ప్రశ్నించడంతో నరసింహారెడ్డి కంగుతిన్నారు. తనకు ఇచ్చిన పేర్ల ప్రకారమే వేదికపైకి పిలిచామని అంతకుమించి తనకేమీ తెలియదని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆగ్రహావేశాలతో జ్ఞానేశ్వర్ ఊగిపోయారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారని.. కొత్తగా వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ తనను పక్కకు పెట్టారని ఆరోపించారు. తమ గ్రామాల్లో భూములను తీసుకుని గుడిని నిర్మిస్తూ తమనే విస్మరిస్తారా? అని కోపోద్రిక్తులయ్యారు.
ఎందుకు నిర్బంధించారు?
ఆంజనేయులు, మాజీ సర్పంచి, హిమాయత్‌సాగర్
సీఎం రేవంత్‌రెడ్డి మా గ్రామ శివారులో ఆలయ శంకుస్థాపనకు వస్తున్నారని, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు వచ్చి నిర్బంధించారు. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నన్ను ఎందుకు నిర్బంధించారో అర్థం కావడం లేదు. మేం కార్యక్రమాన్ని అడ్డకుంటామని ఎవరు చెప్పారు. మా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటాం. సొంత పార్టీ కార్యక్రమాలకు హాజరు కానివ్వకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరం. మేం ఏ పార్టీలో ఉన్నాం అని మాకే అనుమానం వచ్చేలా చేస్తున్నారు.
