బడంగ్‌పేట, నవంబర్ 30: రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్‌తో ముందుకు వెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్లో గత కొన్ని నెలలుగా పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ ఇస్తున్నారు. ఈ కేంద్రాన్ని బుధవారం ఉదయం మంత్రి సందర్శించారు. శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉచిత కోచింగ్ ఇస్తున్న సీఆర్పీఎఫ్ మాజీ ఉద్యోగి ఎనుముల కొండల్‌రెడ్డి, శ్రీగణేశ్, బిగ్‌టైమ్ అకాడమీ శివశంకర్, రాచకొండ పోలీసులతో మంత్రి మాట్లాడారు.
ఉదయం శిక్షణ తీసుకుంటున్న వారికి పాలు, గుడ్లు, పండ్లు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. శిక్షణను ఇదేవిధంగా కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులకు పాలు, గుడ్లు అందజేసి, శిక్షణను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. గడిచిన ఐదేండ్ల కాలంలో 1.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు మరోసారి 80వేల ఉద్యోగాలకు ప్రకటన వేశామని మంత్రి చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, శిక్షణ కేంద్రం నిర్వాహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.