Telangana Martyrs | తెలంగాణ అమర వీరుల కుటుంబాలను ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ స్వరాష్ట్రం సాధించాక ఆదుకుంది. ఇచ్చిన మాట ప్రకారం రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు విద్యార్హతకు అనుగుణంగా ఉద్యోగాన్ని ఇచ్చి, గౌరవాన్ని చాటుకుంది. మేడ్చల్ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో అప్పటి పాలకులు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా నలుగరు బలిదానం చేశారు. ఆ కుటుంబాలు ప్రస్తుతం జీవితంలో స్థిరపడి, గౌరవంగా బతుకుతున్నాయి. వారిని కదిపితే ఒక కంట కన్నీటితో పాటు మరొ కంట ప్రభుత్వం ఆదుకున్న సంతృప్తి కూడా వెల్లడవుతున్నది.
అలుపెరగని పోరాటాలు, మరెన్నో బలిదానాలు, కేసీఆర్ వజ్ర సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ ఉద్యమం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. రాని తెలంగాణ కోసం యువతను విద్యార్థులు, యువకులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. నాడు ఉద్యమాన్ని తప్పుపట్టి తిట్టిన వాళ్లే.. నేడు ప్రత్యేక రాష్ట్రంలో సాధించుకుంటున్న ప్రగతిని చూసి గర్వంగా మెచ్చుకుంటున్నారు. అమరుల ఆత్మబలిదానాలతో రోడ్డున పడ్డ కుటుంబాలకు రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ అండగా నిలబడి మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా నేనున్నాననే భరోసాను, నమ్మకాన్ని వాళ్లకు కల్పించారు. భరోసాను, భద్రతను కల్పించడమే కాకుండా అమరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాన్ని ఇవ్వడంతో పాటు రూ.10 లక్షల తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది.
దీంతో నాడు రాని తెలంగాణ కోసం చచ్చి మా బతుకులను ఎక్కడ కాకుండా చేశారని ఉద్యమాన్ని, చనిపోయిన అమరులను తిట్టుకున్న కుటుంబాలే..నేడు గొప్పగా కీర్తిస్తున్నారు. అమరుల కుటుంబాలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారంతో అమరుల కుటుంబాల మోములో వెలుగులు విరజిమ్ముతున్నాయి. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలో తమ కుటుంబ సభ్యుడు కూడా ఒక సమిధ అయినందుకు వారు గర్విస్తున్నారు. నేడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నగరం నడిబొడ్డున అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా అమరుల కుటుంబాలు తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఉద్యోగం ఇచ్చారు..
తెలంగాణ కోసం నా కొడుకు చనిపోవడం బాధగా ఉంది. ఆ బాధతోనే నా భర్త మంచం పట్టాడు. క్యాన్సర్ వచ్చి, బాగా డబ్బులు ఖర్చు పెట్టాం. అప్పుల పాలయ్యాం. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ నా పెద్ద కొడుకు యాదగిరికి ఉద్యోగం ఇచ్చాడు. 10 లక్షల రూపాయలతో చేసిన అప్పులు తీర్చుకున్నాం. నా కొడుకు
చనిపోవడం బాధగా ఉన్నా కేసీఆర్ ఉద్యోగం ఇచ్చి, నా పెద్ద బిడ్డ బతుకు నిలబెట్టిండు.
-అమరుడు శ్రీకాంత్ తల్లి ఆగమ్మ,
కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది..
సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేం. మేం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్‌లో ఉంటాం. ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో మా అన్న సురేశ్ తెలంగాణ కోసం కలత చెందుతూ ఉండేవాడు. ఆంధ్రోళ్లు తెలంగాణ ఇస్తారా లేదో అని బాధ పడుతుండే వాడు. ఏం జరిగిందో తెలియదు కానీ జులై 31, 2011 రోజు కిష్టాపూర్‌లో తెలంగాణ కోసం చనిపోతున్నట్టు గోడపై రాసి, ఉరేసుకున్నాడు. మా అమ్మ జయమ్మ, నాన్న యాదయ్య, నేను మరో అన్న నాగేశ్ చాలా బాధపడ్డాం. ఎంత మంది చనిపోతే తెలంగాణ ఇస్తారో అనుకునేవాళ్లం. చివరికి కేసీఆర్ తెలంగాణకు తీసుకువచ్చిండు. ఆయన సీఎంగా అయిన తర్వాత ఉద్యమంలో చనిపోయిన వాళ్ల కుటుంబాలకు ఇచ్చినట్టు మా ఇంటికి ఉద్యోగం, రూ.10 లక్షలు ఇచ్చారు. నాకు ఎంపీడీవో ఆఫీస్‌లో అటెండర్ పోస్టు ఇచ్చారు. రూ.10 లక్షలతో మాకు చాలా ఉపయోగపడ్డాయి. మా అన్న చనిపోయిండని బాధగా ఉన్నా కేసీఆర్ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలను గుర్తించి, ఆదుకోవడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రజలకు చాలా మంచి చేస్తుండు.
– శోభారాణి, లబ్ధిదారురాలు
రాంరెడ్డి కుటుంబానికి తోడుగా..
అడ్డగుట్ట, జూన్ 21 : ఉద్యమ సమయంలో అమరుల ఆత్మబలిదానాల వల్ల ఎన్నో కుటుంబాలు తెలంగాణ ఉద్యమాన్ని తిట్టుకున్నాయి. ఇదే పరిస్థితి అమరుడు మోతే రాంరెడ్డి కుటుంబంలో కూడా ఎదురైంది. రాంరెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురకుగా పాల్గొన్నాడు. తెలంగాణ వస్తుందని పోరాడి అలసిన పోయిన రాంరెడ్డి తీవ్రమనోవేదనకు గురై 2013 జూతై 17వ ఏదిన ఉరేసుకొని ఆత్మబలిదానం చేసుకున్నాడు. రాని తెలంగాణ కోసం కొట్లాడి చెట్టంతా కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందారు. కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాంరెడ్డి కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించడంతో పాటు రూ.10 లక్షల ఆర్థికసాయం, ఇల్లు కట్టించి ఇచ్చింది. ప్రస్తుతం కొడుకు సజీవంగా వారి మధ్య లేడనే బాధ తప్పా అన్ని సౌకర్యాలను, ధైర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించింది. దీంతో నాడు కలత చెందిన కుటుంబం నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును మనసారా ఆశీర్వదించింది. – మోతె రాంరెడ్డి(ఫైల్)
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..
మా తమ్ముడు శ్రీకాంత్ చనిపోవడంతో ఎంతో బాధపడ్డాం. కుటుంబమంతా కుమిలిపోయాం. అప్పటి ప్రభుత్వం తీరు వల్లే తెలంగాణ ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ వచ్చా కేసీఆర్ నాకు కమర్షియల్ టాక్స్ ఆఫీసులో సబార్డినేట్‌గా ఉద్యోగం ఇచ్చారు. అప్పటి నుంచి నాంపల్లిలో ఉన్న ఆఫీసులో పని చేస్తున్నాను. ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటకు కేసీఆర్ కట్టుబడ్డారు. మా కుటుంబాన్ని ఆదుకున్నారు. సీఎం కేసీఆర్ అన్ని బాగు చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, పింఛన్లు, గొర్రెల పంపిణీ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అభివృద్ధి కూడా బాగు చేస్తున్నారు. ఇంటింటి అందుతున్న పథకాలతో ప్రజలు బాగున్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యపడింది. ఆయనే గనుక ముందుండి ఉద్యమం నడిపించకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇంత అభివృద్ధిని, ప్రజలకు జరుగుతున్న మంచిని కండ్ల చూసేవాళ్లం కాదు. – యాదగిరి, లబ్ధిదారుడు
మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి
దుండిగల్, జూన్ 14 : నా కొడుకు సురేశ్‌చంద్ర తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అమరవీరుల కుటుంబాలను గుర్తుపెట్టుకుని ఆర్థికంగా ఆదుకోవడం గొప్ప విషయం. ప్రభుత్వం అందించిన రూ.10లక్షల ఆర్థిక సాయంతో జగద్గిరిగుట్టలో ఇల్లుకొనుక్కున్నాం. నా కోడలుకు దుండిగల్ ప్రభుత్వ పాఠశాలలో అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చారు. ప్రస్తుతం నాతో సహా, నా కోడలు, మనవరాళ్లతో జీవితం సంతోషంగా సాగిపోతుంది.స్వతహాగా కళాకారిణిగా రానిస్తున్న నేను తెలంగాణ ఉద్యమంలోనూ ఉద్యమ గీతాలు ఆలపించాను. కళాకారుల కోటాలోనూ నాకు ఉద్యోగ అవకాశం కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం. సీఎం కేసీఆర్‌కు మేము జీవితాంతం రుణపడిఉంటాం. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.
-తెలంగాణ అమరుడు, సురేశ్‌చంద్ర తల్లి రాజేశ్వరి