తెలంగాణ ఇస్తారని పొరపాటున నమ్మి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటే 15 ఏండ్లు ఏడిపించి, వందల మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గమైన పార్టీ అది. నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ శత్రువే. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం బోధన్ నియోజకవర్గం అభ్యర్థి మహ్మద్ షకీల్ అమీర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాలకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో సింగూరు ప్రాజెక్టును కట్టి.. నిజాంసాగర్‌ను ఎండబెట్టి రెండు ప్రాజెక్టుల కింద ఉన్న రైతులకు నరకం చూపించిండ్రు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు చూస్తున్నారు.
నిజాంసాగర్‌కు పూర్వవైభవం తీసుకువచ్చి.. సింగూరును నింపి.. కాల్వలను బాగుచేసి, చెక్‌డ్యాములు కట్టి.. రైతుల ముఖాలు తెల్లబడేలా చేసినం. దేశంలోనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు అప్పులు కట్టకుంటే తలుపులు ఊడపీక్కపోయారు.. కానీ రైతుబంధు గురించి ఆలోచించలేదు. మన దగ్గర ఉన్న పథకాలు పక్కనే ఉన్న మహారాష్ట్ర,కర్ణాటకలో ఉన్నాయా.? వాళ్లు మన రాష్ట్రంలో కలుపమని అడుగుతున్నరు. మళ్లీ కాంగ్రెస్ రాజ్యం వస్తే.. కరెంటు కాట కలుస్తది..రైతుబంధు, రైతు బీమాకు రాంరాం.. చెప్తరు. ధరణి బంగాళాఖాతానికి.. రైతులు అరేబియా సముద్రానికి అంతేకదా.. కాంగ్రెస్ పార్టీ అంటేనే బ్రోకర్లు, దళారులు, పైరవీకారుల రాజ్యం.
అందుకే చెప్తున్న.. రైతులు అందరూ ఆలోచించి దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించాలి. బీజేపీ మతపిచ్చితోని మంటలు పెట్టి ప్రజలను విడగొట్టే పనులు చేస్తున్నది. మెడికల్ కాలేజీ ఇవ్వలే, నవోదయ స్కూల్ ఇవ్వలే.. ఆ పార్టీ నేతలు ఓట్లకోసం వస్తే.. నిలదీసి అడగండి. రెండు జాతీయ పార్టీలు తెలంగాణను ముంచినవే. గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీకి ఓటువేసి అభివృద్ధిని కొనసాగించుకోవాలి. అని సీఎం కేసీఆర్ అన్నారు.