వెంగళరావునగర్, ఫిబ్రవరి 22 : దీన జనోద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకంతో దళితుల మోముల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. దళిత బంధు లబ్ధిదారులతో మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావునగర్ డివిజన్లోని మధురానగర్ కమ్యూనిటీ హాల్లో కలెక్టర్ ఎల్.శర్మన్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చొరవతో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానిది ఎంతో మంచి మనస్సు అని కొనియాడారు. దళితులు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారని చెప్పారు. ఉత్తమ ఆలోచనతో పరిశ్రమను స్థాపించుకుని పది మందికి ఉపాధి కల్పించాలని లబ్ధిదారులకు సూచించారు. చిన్న పరిశ్రమతో వ్యాపారాన్ని ప్రారంభించాక.. మార్కెటింగ్ చేసుకోగలిగితే వ్యాపారంలో రాణించవచ్చని అన్నారు. టీ స్టాల్ పెట్టుకున్నా.. నాణ్యత బాగుంటే వినియోగదారులు ఆకర్షితులవుతారని.. నాణ్యతా ప్రమాణాలను పాటించగలిగితే వ్యాపారాభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం లబ్ధిదారులు ఏర్పాటు చేసుకోబోయే పరిశ్రమల గురించి ఆరా తీసి..వారికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.
సీఎం కేసీఆర్ గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది. దళిత కుటుంబానికి సీఎం కేసీఆర్ పెద్దదిక్కులా మారారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దళితుల్ని ధనవంతులుగా మార్చేందుకే దళితబంధు పథకాన్ని తెచ్చారు. దళిత ఆడబిడ్డల బ్యాంక్ అకౌంట్లలోనే రూ.10 లక్షల చొప్పున డబ్బు జమ చేస్తాం. డబ్బును దుబారా చేయకుండా పొదుపుగా వ్యాపారం చేసి లాభాలు ఆర్జించాలి.
– జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్
ఇంట్లోనే టైలరింగ్ చేసేదానిని. దళిత బంధు పథకానికి అర్హురాలైనట్లు అధికారులు చెప్పడంతో మా ఆనందానికి అవధుల్లేవు. రూ.10 లక్షల డబ్బుతో టైలరింగ్, బోటిక్ డిజైనింగ్‌తో పాటు ఓ కూరగాయల మార్కెట్ ను కూడా ప్రారంభించాలని భావిస్తున్నాం. మరో నలుగురు మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తాను. ఈ వ్యాపారాలతో మా బతుకులు మారబోతున్నాయి. నిజంగా సీఎం కేసీఆర్ మా ఇంట్లో దీపం పెట్టిన దేవుడు.
– సాదెమాల సుజాత, ఎల్లారెడ్డిగూడ
ఇది మా కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపింది. నా భర్త ఇరుగు మహేశ్ సెంట్రింగ్ పనిచేస్తడు. నేను కూలికి పోతా. నేరుగా మా బ్యాంకు అకౌంట్లో దళిత బంధు డబ్బును జమ చేస్తామని అధికారులు చెప్పారు. ఆ పైసలతో సెంట్రింగ్ పనులు చేసుకునే మేము కాంట్రాక్టర్ కాబోతున్నాం. కూలి పనులు చేసిన మేమే మరో పది మందికి పని కల్పిస్తామనే సంతృప్తి ఉంది. మా కోసం ఇంత మేలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఎమ్మెల్యే మాగంటిని జీవితాంతం మర్చిపోలేం.
– ఇరుగు రేణుక, యూసుఫ్‌గూడ