సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): సింగరేణి తెలంగాణ కొంగుబంగారం..ఆ సింగరేణిని మరింత విస్తరించుకుంటాం..కార్మికుల శ్రేయస్సే ముఖ్యం. కాంగ్రెస్ దద్దమ్మల రాజ్యంలో కరెంటు లేకుండే.. సాగునీళ్లు లేకుండే.. మంచి నీళ్లు లేకుండే.. గోదావరి ఒడ్డున ప్రాంతాలకూ నీళ్లు ఇవ్వలేకపోయారు. సింగరేణిని కూడా నిండా ముంచిండ్రు. కేంద్రం వద్ద అప్పులు తెచ్చి.. అవి తిరిగి చెల్లించడం చేతగాక 49 శాతం వాటా కేంద్రానికి అప్పగించారు.
రూ. 600 కోట్ల మారటోరియంలో ఉండి మునగడానికి సిద్ధంగా ఉన్న సింగరేణిని కాపాడి, నేడు రూ. 2,200 కోట్ల లాభాల్లోకి తీసుకుపోయాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల, రామగుండం ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు దివాకర్‌రావు, చందర్‌కు మద్దతుగా ప్రసంగించారు. ‘సింగరేణి వంద శాతం మనకే ఉంటుండే.. అలా లేకుండా చేసిందే కాంగ్రెస్’ అని విమర్శించారు.
‘సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఉండే. వాటిని ఊడగొట్టిందే కాంగ్రెస్. తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించుకున్నాం. సింగరేణి కార్మికులు ఇండ్లు కట్టుకుంటే 10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తున్నాం. ఇటీవలే సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్, లాభాల వాటా కలిపి రూ. 1000 కోట్లు పంచినం. ఆగమాగం ఓట్లు వేయొద్దు. మంచిగా ఆలోచించి ఓటేయాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.