సుల్తాన్‌బజార్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృధ్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం కోఠిలోని యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాలలో 16వ కాన్వకేషన్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మ కమైన కోఠి మహిళా కళాశాలలో చదవాలనే ఆసక్తితో తాను అడ్మిషన్ కోసం గంట పాటు వేచి ఉన్నా సీటు లభించలేదని ఈ సంధర్భంగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
విద్యా భోధన చేసి డిగ్రీ పట్టా తీసుకోవాలని ఆశించినా అది సాధ్యం కాక నేడు ముఖ్య అతిధిగా విచ్చేసి విద్యార్థిణులకు డిగ్రీ పట్టాలను అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి విద్యార్థులు గోల్డ్ మెడల్‌లను సాథించిన,డిగ్రీ పట్టాలను అందుకుంటున్న విద్యార్థణులను ఆమె ప్రత్యేకంగా అభిందించారు.
ఉస్మానియా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ మాట్లాడుతూ 42 ఎకరాల విస్తీర్ణంలో 4500 మంది విద్యార్థినులు చదువుకుంటున్న ఈ కళాశాలలో నూతన హాస్టల్ బ్లాక్ నిర్మాణానికి సహకరించాలని ఈ సంధర్భంగా మంత్రికి విన్నవించారు.ఈ కళాశాలతో తనకెంతో అనుబంధం ఉందన్నారు.తన ఉద్యోగ ప్రస్థానం ఈ కళాశాలలో లెక్చరర్‌గా ప్రారంభమైందన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం విజ్జులత మాట్లాడుతూ కళాశాలలో నిర్వహించిన పరీక్షలలో 1006 మంది విద్యార్థులు, అందులో 12 మంది విదేశీ విద్యార్థులు పాల్గొనగా 962 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైయ్యారని అన్నారు.ఈ పరీక్షలలో 95.63 శాతంగా ఉందన్నారు. బీఏలో 95.94 శాతం,బీ కాంలో 95.86 శాతం,బీఎస్సీలో 95.39 శాతం అన్నారు. ఈ కాన్వకేషన్‌లో మొత్తంగా 8 మంది విద్యార్థిణులకు గోల్డ్ మెడల్‌లను అందించారు.