సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : శాసనసభ ఎన్నికలకు గులాబీ పార్టీ సమరశంఖం పూరించింది. అన్ని పార్టీల కంటే ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాల శిబిరాల్లో అలజడిని సృష్టించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని నాంపల్లి, గోషామహల్ మినహా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ప్రకటించారు. ఈ తొలి జాబితాలో ఉప్పల్ నియోజకవర్గం మినహా అన్నిచోట్ల సిట్టింగ్‌లకే మరోసారి అవకాశం కల్పించడం, ప్రధానంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్లతో పాటుగా గత ఎన్నికల్లో పాతనగరం లాంటి ప్రాంతాల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి కూడా సీట్లు కేటాయించారు. రెండో విడతలో నాంపల్లి, గోషామహల్ అభ్యర్థులను వారం వ్యవధిలో ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
సిట్టింగ్‌లకు పెద్దపీట
అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దింపిన అభ్యర్థుల్లో మెజార్టీ స్థాయిలో సిట్టింగ్‌లే ఉన్నారు. సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, షాద్‌నగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పటాన్చెరు నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగిన వారికే మళ్లీ మరోసారి అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన యాకత్పురా, చాంద్రాయణగుట్ట, కార్వాన్, బహదూర్‌పుర నియోజకవర్గ అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో తమ అదృష్టం పరీక్షించుకునే అవకాశం కల్పించారు.
నిరంతరం ప్రజల్లోనే ఉన్నందుకే..
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చేయడంతోపాటు నిరంతరం ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నందుకే సీఎం కేసీఆర్ మరోసారి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. గతంలో ఎన్నడూలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించగలిగాం. పేదలు అధికంగా నివాసం ఉంటున్న మా నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి. షాదీముబారక్. ఆసరా పింఛన్ల ద్వారా వేలాదిమంది లబ్ధి పొందుతున్నారు. వారందరి ఆశీర్వాదంతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తా. హైదరాబాద్ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు దక్కాయి. నగరంలో చేసిన అభివృద్ధి కండ్ల ముందే కనబడుతున్నది. అభివృద్ధి ఫలితాలు అనుభవిస్తున్న హైదరాబాద్ ప్రజలు మరోసారి జిల్లాలోని అన్ని సీట్లను గెలిపిస్తారు.
– మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడుతా అభివృద్ధి, సంక్షేమ పథకాలే విజయానికి సోపానాలు
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం కల్పించి టిక్కెట్లను ఖరారు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతా. ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా ఎనలేని కృషి చేస్తున్నారు. ఇవే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు సోపానాలు. ప్రభుత్వం చేపడుతున్న పనులను వివరించి భవిష్యత్తులో మరింత అభివృద్ధి కోసం బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ప్రజల ముందుకు వెళ్తా. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఎం కేసీఆర్ వల్లనే సాకారమవుతుందన్న నమ్మకం ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. ఈ ప్రాంతానికి ఫాక్స్‌కాన్ వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు తరలివస్తున్నాయి. రాబోవు రోజుల్లో మెడికల్ కళాశాల, మెట్రో రైలు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి రాబోతున్నాయి. సీఎం కేసీఆర్ వెన్నంటే ప్రజానీకం ఉంది. తప్పక బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తారనే నమ్మకం ఉంది.
– పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
తనపై నమ్మకం ఉంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సాయన్న కుటుంబ మా కుటుంబమే అంటూ ప్రకటించిన కేసీఆర్ చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. తనకు టికెట్ కేటాయించడంలో నైతిక మద్దతు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి సహా జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సహకారం మరువలేనిది. కంటోన్మెంట్లో తన తండ్రికి ఉన్న జన బలమే తమను ఈ స్థాయిలో నిలిపింది. ఎట్టి పరిస్థితుల్లో కంటోన్మెంట్‌పై గులాబీ జెండాను ఎగురవేస్తాం.
– జ్ఞాని లాస్యనందిత, కంటోన్మెంట్ అభ్యర్థి
మళ్లీ అవకాశం ఇచ్చినందుకు సంతోషం
యాకుత్‌పురా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. పాతబస్తీలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయటానికి చేస్తున్న కృషిని గుర్తించి సీఎం రెండోసారి పోటీ చేసే అవకాశం కల్పించారు. నియోజకవర్గ సమస్యలపై నాకు పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. ఐఎస్ సదన్ డివిజన్లో కార్పొరేటర్‌గా తన సతీమణి సామ స్వప్నారెడ్డి చేసిన అభివృద్ధి పనులను, ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ఎన్నికల ప్రచారంలో వివరిస్తా. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తా.
– సామసుందర్ రెడ్డి , సైదాబాద్ అభ్యర్థి
ప్రజా ఆశీర్వాదంతో హ్యాట్రిక్ సాధిస్తా
దేశంలోనే అతి పెద్ద రెండో అసెంబ్లీ నియోజకవర్గానికి శాసన సభ్యుడిగా రెండు దఫాలుగా ఎన్నికవ్వడం అత్యంత సంతోషకరంగా ఉన్నది. శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంపూర్ణ తోడ్పాటుతో తగు నిధుల కేటాయింపు.. పనుల ఆచరణలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. 50 ఏండ్లుగా నోచుకోని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌ది. నియోజకవర్గ ప్రజల సంపూర్ణ ఆశీర్వాదంతో ముచ్చటగా మూడో సారి గెలుపు తథ్యం. ఇప్పటికే వేలాది కోట్లతో నియోజకవర్గాన్ని అందరూ మెచ్చేలా తీర్చిదిద్దా. రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, మెరుగైన విద్యుత్ సహా ఇతర మౌలిక వసతులను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తా.
-అరెకపూడి గాంధీ, విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే
చేసిన అభివృద్ధి ప్రజల కండ్ల ముందే ఉంది
సనత్‌నగర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు.. ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు వారి కండ్ల ముందే ఉన్నాయి. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేశాం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో అత్యధికంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, వైట్ ట్యాపింగ్ రోడ్లు, నాలాల అభివృద్ధి, మల్టీపర్సస్ ఫంక్షన్‌హాల్స్, బస్తీ దవాఖానలు వీటితోపాటు డ్రైనేజీ, రోడ్లు, నాలాలపై వంతెన నిర్మాణాలు, తాగునీటి రిజర్వాయర్లు, కమ్యూనిటీ హాల్స్ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కాబట్టి ప్రజలు తప్పకుండా మరోసారి ఆశీర్వదిస్తారు.
– మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతా లక్షకు మించి మెజార్టీ సాధిస్తా
సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతా. ప్రజల ఆశీర్వాదంతో లక్షకు మించి మెజార్టీ సాధిస్తా. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పూర్తి నమ్మకం ఉన్నది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం. ఎన్నో మంచి పనులు చేశాం. ప్రజల మద్దతు పూర్తిగా బీఆర్ఎస్కే ఉన్నది. హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. నియోజకవర్గంలో నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలను తీరుస్తున్నాం.. అభివృద్ధి చేస్తున్నాం. ఓట్లు అడిగే హక్కు మాకే ఉన్నది. కేసీఆర్‌కు మేడ్చల్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిచి, గిఫ్ట్‌గా ఇస్తా.
– చామకూర మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి
అభివృద్ధి, సంక్షేమమే మళ్లీ గెలిపిస్తుంది..
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తాము వ్యక్తిగతంగా నిత్యం ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యమైన తీరు తమకు అఖండ విజయాన్ని అందిస్తుంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 50 ఏండ్లలో చేపట్టని ఎన్నో అభివృద్ధి పనులను కేవలం గత తొమ్మిదేండ్లలోనే చేపట్టాం. తనపై నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటా. కరోనా కష్ట కాలంలో కూడా తాము ప్రజల వెన్నంటే ఉన్నా. తనకు మరోసారి అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో తనకు మరోసారి టికెట్ రావడం సంతోషంగా ఉంది. తనపై నమ్మకంతో మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. హ్యాట్రిక్ అవకాశం రావడం సంతోషంగా ఉంది. మొదటిసారి 17వేలు, రెండవ సారి 50వేల మెజార్టీతో సికింద్రాబాద్ ప్రజలు తనను గెలిపించారు. ఈసారి హ్యాట్రిక్ కావడంతో దాదాపు 80వేల మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు.
– తీగుల్ల పద్మారావుగౌడ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్