Ranganath | పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 11: రోడ్డు గాల్లో నుంచి ఎగిరి పడ్డదా? చెరువును కబ్జా చేస్తూ రోడ్డు ఎలా వేస్తారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మున్సిపల్ అధికారులను నిలదీశారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధి కుంట్లూరులోని పెద్ద చెరువును బుధవారం ఆయన పరిశీలించారు. చెరువు ను కబ్జా చేస్తూ పట్టా పొలాలకు 40 ఫీట్ల రోడ్డు వేస్తున్నారని కళ్లెం వెంకట్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో రెండోరోజు బుధవారం హైడ్రా అధికారులు సర్వేను కొనసాగించారు. రోడ్డు నిర్మాణంపై ఫిర్యాదుతో రంగనాథ్ కూడా చెరువును పరిశీలించి, మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డిపై గరమయ్యారు. రోడ్డు కోసం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందని కమిషనర్ వివరించగా, ప్రభుత్వ స్థలాలు, చెరువుల నుంచి రోడ్డు వేసేందుకు ఎలా తీర్మానం చేస్తారని ప్రశ్నించారు.
తీర్మానం ఎట్లంటే అట్ల చేయడానికి లేదు కదా? టెండర్లు లేకుం డా, ఎస్టిమేషన్ వేయకుండా రోడ్డు గాల్లో నుంచి పడ్డదా అని నిలదీశారు. చెరువులో నుంచి వేసిన రోడ్డును తీసేయాలని ఆదేశించారు. థర్డ్ పార్టీవారు రోడ్డు వేశారేమోనని పుర కమిషనర్ చెప్పగా.. రోడ్డు వేసిన వారిపై కేసు చేసి, లోపలేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీని కాదని రోడ్డు ఎవరు వేశారని ప్రశ్నించారు. కుంట్లూరు రెవెన్యూ 185 సర్వే నంబర్లోని పెద్ద చెరువు ప్రిలిమినరీ నోటిఫికేషన్ పూర్తయిందన్నారు. గతంలో కౌన్సిల్ తీర్మానం చేసిందని మున్సిపల్ అధికారులు చెప్పినా, చెరువు నుంచి రోడ్డు వేయడానికి లేదన్నారు. సర్వే తర్వాత 185 సర్వేనంబర్ బోర్డర్ నుంచి రోడ్డు వేసుకునేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. గ్రామ నక్ష ప్రకారం చెరువు ఎంత విస్తీర్ణంలో ఉన్నదో గుర్తించి, హద్దులు ఏర్పాటుచేస్తారని తెలిపారు. కుంట్లూరు పెద్ద చెరువు ప్రిలిమినరీ నోటిఫికేషన్లో దాదాపు 65 ఎకరాలు ఉన్నదని, నక్షప్రకారం 95 ఎకరాలు ఉన్నదన్నారు. నక్షప్రకారమే సర్వే చేయాలని సూచించారు. హైడ్రా కమిషనర్ వెంట మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అధికారులు ఉన్నారు.