Hyderabad | సిటీబ్యూరో: హైదరాబాద్ నగరం స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుస్తుందా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో వచ్చిన ర్యాంకుల కంటే మెరుగైన ఫలితాలను రాబడుతుందా? ప్రస్తుత పారిశుధ్య నిర్వహణలో క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. త్వరలో స్వచ్ఛ సర్వేక్షణ్-2024 ర్యాంకుల ప్రకటన, సర్వే ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో జీహెచ్ఎంసీ అధికారుల్లో గుబులు మొదలైంది.
ఏటా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా కీలక నగరాలకు ర్యాంకులను ప్రకటిస్తూ వస్తున్నది. 2015 నుంచి 2023 వరకు 10 లక్షల జనాభా కంటే ఎక్కువ సిటీ జాబితాలో హైదరాబాద్ మెరుగైన ర్యాంకింగ్ సాధించింది. గతేడాది సిటీ 9వ ర్యాంకు, భారతదేశంలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన చెత్త రహిత నగరంగా హైదరాబాద్‌కు అవార్డు దక్కింది. వచ్చే నెలలో స్వచ్ఛ సర్వేక్షణ్-2024పై సర్వే ప్రారంభించి సుమారు రెండు నెలల పాటు జరగనున్నది. ఏప్రిల్‌లో ర్యాంకుల జాబితాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే సర్వే ప్రారంభ దశలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం విరుద్ధంగా కనబడుతుండటం గమనార్హం.
గార్భేజ్ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు కనబడుతున్నాయి. తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్బేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) జీహెచ్ఎంసీ పరిధిలో 2640 ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో వీటికి అదనంగా కొత్తగా జీవీపీ పాయింట్లు పుట్టుకొస్తున్నాయి. సుమారు 5250 స్వచ్ఛ ఆటోల ద్వారా నగరంలో 4886 కాలనీలలో 23 లక్షల గృహాల నుంచి రోజుకు 7వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త సేకరణ జరగాలి.
ఒకొక ఆటోకు కాలనీ వారీగా చూస్తే ఒకటి లేదా రెండు కాలనీలు గృహాల ప్రకారంగా గమనిస్తే ఒకొక అటో కు సుమారుగా 500 నుంచి 600 ఇండ్లను కేటాయించి, చెత్త సేకరణ జరపాలి. కానీ గడిచిన కొన్ని రోజులుగా స్వచ్ఛ ఆటోల పనితీరు సరిగా ఉండడం లేదు..చాలా కాలనీలకు రోజూ స్వచ్ఛ ఆటోలు రావడం లేదు..వంద శాతం స్వచ్ఛ ఆటోల అటెండెన్స్ ఉండటం లేదు. రోజూ 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని స్వయంగా గత కమిషనర్లు గుర్తించారు. కానీ నేటికీ స్వచ్ఛ ఆటోల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది.
స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టి మెరుగైన ర్యాంకులను సాధించింది. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా తడి, పొడి చెత్త వేర్వేరు , ఇంటింటి నుంచి చెత్త సేకరణ కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం, ఓడీఎఫ్‌కు చర్యలు, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ చర్యలు, స్వచ్ఛతపై చైతన్య కార్యక్రమాలు, 50 మైక్రాన్ల కన్నా తక్కువ నిడివి ఉన్న ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలు పక్కాగా చేపట్టింది.
ప్రధానంగా చెత్తకుండీలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే క్రమంలో దాదాపు 22 లక్షల గృహాలకు ఒక్కో ఇంటికి తడి, పొడి చెత్త సేకరణకు 44 లక్షల చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఇంటింటికీ చెత్త సేకరణకు 4500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను వినియోగించారు. ట్రాన్స్ఫర్ స్టేషన్లు, ఆధునిక వాహనాల వినియోగంతో వెరసి జీహెచ్ఎంసీకి ‘ బెస్ట్ సెల్ఫ్ సైస్టెనబులిటీ అవార్డు, 3 స్టార్ రేటింగ్ సిటీగా నిలిపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పారిశుద్ధ్య నిర్వహణలో పూర్తి గాడిగా తప్పిందని ఆనడంలో ఎలాంటి సందేహం లేదు.
జీహెచ్ఎంసీ ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను అందుకుంటున్నది. 2015 నుంచి 2022 వరకు 10 లక్షల జనాభా కంటే ఎక్కువ సిటీ జాబితాలో ర్యాంకింగ్ సాధించింది. 2016 సంవత్సరంలో 73 నగరాలకు మెరుగైన 19వ ర్యాంకును, 2017లో ఓడీఎఫ్ సిటీ కేటగిరీలో 434 నగరాలు పాలుపంచుకోగా, అందులో నగరానికి 22వ ర్యాంకు సాధించింది. 2018లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానంలో బెస్ట్ క్యాపిటల్ సిటీ అవార్డు కేటగిరీలో 4041 నగరాలు పాలు పంచుకుంటే నగరానికి 27వ ర్యాంకు వచ్చింది. 2019లో స్వచ్ఛ్ ఎక్సలెన్స్ అవార్డు కేటగిరీలో 4273 నగరాలు పాల్గొంటే , హైదరాబాద్‌కు 35వ ర్యాంకు వచ్చింది. ఓడీఎఫ్ ++ సిటీగా గుర్తింపు దక్కింది. 2020లో బెస్ట్ మెగా సిటీ అవార్డు సిటీజన్ ఫీడ్ బ్యాక్‌లో 4384 నగరాలు పాల్గొంటే నగరానికి 23వ ర్యాంకు వచ్చింది.