ఖైరతాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి తారాస్థాయికి చేరుకున్నది. పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం బంజారాహిల్స్‌లోని లేక్‌వ్యూ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరగడంతో సమావేశం రసాభాసాగా మారింది.
-బంజారాహిల్స్, జూన్ 14
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల మధ్య సమన్వయం తీసుకురావడంతో పాటు డివిజన్ కమిటీల ఏర్పాటు ప్రక్రియను చేపట్టేందుకు పీసీసీ ఆదేశాలతో ఖైరతాబాద్ నియోజకవర్గం పార్టీ నేతల సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. పార్టీ తరపున పరిశీలకులుగా సీనియర్ నేతలు వినోద్, సౌజన్య హాజరైన ఈ సమావేశంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు డా.రోహిణ్‌రెడ్డితో పాటు పార్టీ కార్పొరేటర్లు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. సమావేశంలో అన్ని డివిజన్ల నుంచి నాయకులకు మాట్లాడే అవకాశం ఇచ్చిన తర్వాత ముఖ్యనాయకులు మాట్లాడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సమావేశ ప్రాంగణంలోకి వచ్చిన ఖైరతాబాద్ కార్పొరేటర్, పీసీసీ కార్యదర్శి విజయారెడ్డి తన అనుచరులకు మైక్ ఇవ్వడంతో వివాదం ప్రారంభమైంది.
ముందుగానే స్థానిక నాయకులకు మైక్ ఇచ్చారని, ఇప్పటికే ఆలస్యమైందని, మీరు మాట్లాడాలంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించినా విజయారెడ్డి పట్టించుకోలేదు. తన అనుచరులతో మాట్లాడించడంపై ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో విజయారెడ్డి అనుచరుడు మాట్లాడే సమయంలో పాత వారిని పక్కన పెట్టి కొత్తవారికి ప్రాధాన్యత ఇస్తే వదిలిపెట్టేది లేదంటూ.. హెచ్చరింపు ధోరణిలో మాట్లాడడంతో సభావేదికపై ఉన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్రంగా స్పందించారు. పార్టీని బెదిరిస్తున్నారా.. అంటూ గట్టిగా మందలించడంతో గొడవ రాజుకున్నది. ఒకవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు, మరోవైపు విజయారెడ్డి అనుచరులు పరస్పరం నినాదాలు చేసుకుంటూ బాహాబాహీకి దిగారు.
గట్టిగా కేకలు వేస్తూ గొడవకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు, కార్పొరేటర్ విజయారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీ ఇన్చార్జీలు వారిస్తున్నా..ఇరువర్గాల కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో గందరగోళం నెలకొంది. సుమారు 10 నిమిషాల పాటు గొడవ జరిగిన తర్వాత కార్యకర్తలు శాంతించారు. రానున్న డివిజన్ అధ్యక్షుల ఎంపికలో పాతవారికే ప్రాధాన్యత ఇవ్వాలని, కేవలం పెద్ద నేతల వెంబడి తిరుగుతూ పైరవీలు చేసేవారికి పదవులు ఇస్తే ఊరుకునేది లేదంటూ కార్పొరేటర్ విజయారెడ్డి హెచ్చరించారు. కాగా, ప్రజల్లో పలుకుబడి ఉన్నవారికే పార్టీ పదవులు దక్కుతాయని, మీటింగ్స్‌లో వచ్చి జిందాబాద్‌లు కొట్టేవారికి పదవులు దక్కే పరిస్థితి లేదంటూ పరోక్షంగా విజయారెడ్డి అనుచరులకు ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద పార్టీ నాయకుల మధ్య ఐకమత్యాన్ని పెంచడం కోసం ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ సమావేశంలో జరిగిన రచ్చతో పార్టీలోని గ్రూపు తగాదాలు మరింతగా ముదిరిన విషయాన్ని బయటపెట్టాయని పరిశీలకులు అంటున్నారు.